11-08-2025 07:32:42 PM
మండల వైద్యాధికారి నగేష్ నాయక్..
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: 19 సంవత్సరాలలోపు పిల్లల్లో నులిపురుగుల సమస్య ఎక్కువగా ఉంటుందని, ఈ సమస్యను ఒకే ఒక్క ఆల్బెండజోల్ మాత్రతో నివారించవచ్చునని మండల వైద్యాధికారి డాక్టర్ భూక్య నగేష్ నాయక్(Medical Officer Dr. Bhukya Nagesh Nayak) చెప్పారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం మండల కేంద్రం అర్వపల్లిలోని పీహెచ్సీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆల్బెండజోల్-400ఎంజీ మాత్రలను మింగించారు. అర్వపల్లిలోని జడ్పీహెచ్ఎస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల వైద్యాధికారి నగేష్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ, ప్రతిఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అన్నారు.
మలవిసర్జన అనంతరం భోజనం చేసే ముందు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని చెప్పారు. శుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలని, నులిపురుగుల బారిన పడితే రక్తహీనత ఏర్పడి తరచూ అనారోగ్యానికి గురవుతామని సూచించారు.ప్రతి 6నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ 400 ఎంజీ మాత్రను తీసుకోవాలని కోరారు.ఆయా కార్యక్రమాల్లో మండల విద్యాధికారి బాలునాయక్, హెచ్ఎం విజయలక్ష్మి, సీహెచ్ఓ బిచ్చునాయక్, సూపర్వైజర్ లలిత, ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్,ఆరోగ్య సిబ్బంది కుంభం వీరయ్య,జ్యోతి,గిరిజ,ఉపాధ్యాయులు,అంగన్వాడీ టీచర్లు,ఆశాలు తదితరులు పాల్గొన్నారు.