నాట్యమే నా ఉనికి!

07-05-2024 12:15:00 AM

అలేఖ్య పుంజాల.. చక్కటి ముఖం.. పెద్ద పెద్ద కళ్లు.. మువ్వల సవ్వడిలో నుంచి జాలువారిన ‘లకుమ, మండోదరి, రుద్రమదేవి ఇలా ఒక్కటేమిటి ప్రతి పాత్రకు జీవం పోసి నాట్యం చేశారు. తన ఐదు దశాబ్దాల జీవిత కాలంలో ఎన్నో ప్రదర్శనలు, ఎన్నో బాధ్యతలను చక్కగా నిర్వహించారు. నాట్యమే తన ఊపిరిగా జీవించారు. ‘తృష’్ణ అనే ఇన్‌స్టిట్యూట్  ద్వారా ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఉచితంగా నాట్యం నేర్పిస్తున్నారు. ఒక తల్లిగా, కోడలిగా, డ్యాన్సర్‌గా, టీచర్‌గా,  యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఇలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకుంటూ జాతీయ స్థాయిలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలను ‘విజయకాంత్రి’తో పంచుకున్నారామె!

నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే.  తారాపోర్వాలా మాంటిస్సోరి స్కూల్లో చదువుకున్నా. మా స్కూల్లో మ్యూజిక్, డ్యాన్స్ అనేవి కరి క్యులమ్‌లో ఒక భాగంగా ఉండేవి. ముఖ్యంగా మా స్కూల్లో ఫిజికల్ యాక్టివిటీ ద్వారా చదువు నేర్పించేవారు. మాకు వారానికి రెండు రోజులు మాస్టార్ వచ్చి డ్యాన్స్, సంగీతం నేర్పించేవారు. అప్పుడు నా వయసు దాదాపు ఐదు, ఆరు సంవత్సరాలు మాత్రమే. కానీ నాకేమో కూచిపూడి, భరత నాట్యం నేర్చుకోవాలని అనిపించింది. నాకు వీటి మీదే ఎక్కువ మనస్సు ఉండేది. ఎందుకంటే ఏం చెప్పలేను. అప్పుడు ఆ చిన్నతనంలో నేను అనుకుంటున్నాను.. బహుశా కాస్ట్యూమ్, మేకప్, నగలు ఆకర్షణగా ఉండేవేమో నాకు తెలీదు. కానీ ఆ రెండు స్టుయిల్స్ నేర్చుకుంటానని గట్టి పట్టు పట్టాను. 

1977లో అరంగ్రేటం

నా తల్లిదండ్రులు మార్గం నరసింగరావు, సుగుణలు ఎగ్జిబిషన్ సొసైటీ ఫౌండర్ సభ్యులు. దాని ద్వారా ఎక్కువగా కల్చరల్, పొలిటికల్ వాళ్ళతో స్నేహం ఉండేది. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం ఉంది కాబట్టి. మా నాన్న నన్ను మ్యూజిక్ కాలేజీలో చేర్పించాలని అక్కడికి తీసుకెళ్లారు. అప్పుడు నా వయసు ఎనిమిదేళ్ళు. అక్కడ సర్ వయసు 80 ఏళ్ళు.. నన్ను చూడగానే అబ్బబ్బ చాలా చిన్నదండి ఇంకో నాలుగు సంవత్సరాలు అయ్యాక తీసుకురండి అని చెప్పారు. తర్వాత నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు కొంచెం గట్టి ప్రయత్నం చేసి గోపాల్ భట్ సర్, ఉమారామారావు సార్‌ను పరిచయం చేశారు. అలా మాస్టార్ గారితో భరత నాట్యం, కూచిపుడి నేర్చుకున్నాను. ఆ తర్వాత నాకు స్కాలర్‌షిప్స్ రావడం జరిగింది.  మే 13వ తేదీ, 1977 మొట్టమొదటి సారి నేను అరంగేట్రం చేశాను. అరంగేట్రం తర్వాత రెగ్యులర్‌గా ప్రోగ్రామ్స్ చేశాను. అప్పుడు నాకు అర్థం అయింది ఏంటంటే.. నేను ఇక డ్యాన్స్‌లోనే ఉంటాను అని. కానీ దీంట్లో ప్రొఫెషనల్ అవుతాననే అంచనా కూడా లేదు. కానీ ఒక తపన ఉండేది. డ్యాన్స్ ఇంకా బాగా చేయాలి. అందరూ నన్ను మెచ్చుకోవాలి అనే కోరిక ఉండేది. 

చదువును, డ్యాన్స్‌ను ఎలా బ్యాలెన్స్ చేశారు?

మా అమ్మగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. ఇంటర్మీడియట్‌లో విపరీతమైన ప్రోగ్రామ్స్ ఉండేవి. అరంగేట్రం చేసినప్పటి నుంచి ప్రతినెల కచ్చితంగా రెండు, మూడు ప్రోగ్రామ్స్ జరిగేవి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రరాష్ట్రంలో సభలు చాలా యాక్టివ్‌గా జరిగేవి. విజయవాడ, వరంగల్, అమలాపురం, గుంటూరు, బాపట్ల, నిజామాబాద్ వెళ్ళి చేసేదాన్ని. అలా గ్రాడ్యుయేషన్‌కు వచ్చే సరికి ఒక ఆలోచన వచ్చింది. కాలేజీ వెళ్ళి ఎందుకు నేను టైమ్ వృథా చేసుకోవాలి. అదే టైమ్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా చేయొచ్చు కదా అని. అప్పుడు మా అమ్మ ఒక మాట చాలా స్ట్రిక్ట్‌గా చెప్పారు. “నువ్వు ఇది చేయాలంటే, ఇది కూడా చేయాలి” అని కండీషన్ పెట్టారు. నీకు ఇప్పుడు కనిపించదు కానీ ముందు ముందు నీకు అర్థం అవుతుంది దీని విలువేంటో అనేవారు. ఆమె అంత స్ట్రిక్ట్‌గా ఉన్నారు కాబట్టే నేను గ్రాడ్యుయేషన్, డ్యాన్స్ గ్రాడ్యుయేషన్, ఎం.ఎ, పీహెచ్‌డీ చేశాను. అలా చదివాను కాబట్టి ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్‌గా నిలదొక్కుకోగలిగాను. తెలుగు యూనివర్సిటీలో మొట్టమొదటి సారిగా ఒక మహిళా రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహించానంటే కారణం అకాడమిక్ క్వాలిఫికేషన్స్ దీనికి కలిసొచ్చినందుకే కదా! ఒక యూనివర్సిటీలో పని చేయాలంటే దానికోక అకాడమిక్ క్వాలిఫికేషన్ అవసరం కదా. అది ఉంది కాబట్టి దానికి నేను అర్హురాలిని అయ్యాను. 

ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు? 

కొన్ని సంవత్సరాలు అయింది. లెక్కలు వేయడం మానేసి. నా కెరీర్‌లో ఐదు దశాబ్దాలు చాలా సిరీయస్‌గా వర్క్ చేశాను. ఆడవాళ్ళకు జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒకలాగ, పెళ్ళి అయ్యాక ఒకలాగ, కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు వచ్చాక మరిన్ని బాధ్యతలు పెరుగుతాయి. కానీ నాకు మా వారి సపోర్టు బాగా ఉండేది. ఎందుకంటే మా అమ్మ పెళ్లి టైమ్‌లోనే ఒక కండీషన్ పెట్టారు. మా అమ్మాయికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. దానికి ఏం అడ్డు రాకూడదని. ఎందుకంటే అది నా జీవితం. కేవలం డ్యాన్స్ మూలాన నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. డ్యాన్స్ అనేది నా జీవితం, నా వ్యక్తిగతం. అది మీరు విడదీయడానికి ఎవరు కూడా ప్రయత్నించొద్దు అని కండిషన్ పెట్టారు. అందుకు నా భర్త బాగా సపోర్టు చేశారు. నాకు వీలయినంత వరకు శాయశక్తులా భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు ఎంత వరకు వీలు ఉంటే అంత వరకు చేయాలనే ఒక తపన ఉంది. అది ఎంత వరకు ఉంటుందో నాకు తెలిదు. కానీ నా చివరి శ్వాస వరకు దాన్ని వొదిలి పెట్టను. ఐ యామ్ స్టిల్ వర్కింగ్, ఇంకా పిల్లలకు నేర్పిస్తున్నాను. యూనివర్సిటీలో పని చేసి 30 సంవత్సరాలు అయిన తర్వాత వీఆర్‌ఎస్ తీసుకున్నాను. తర్వాత నా దృష్టినంత ప్రొఫెషన్ మీద, పిల్లల మీద, ఇంటి మీద పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ బాధ్యతలు. వీటిలో దేన్నీ విస్మరించడానికి వీలు లేదు కదా. 

డ్యాన్స్ అకాడమీ ఎలా నడుస్తుంది?

మా డ్యాన్స్ అకాడమీ పేరు తృష్ణ. తృష్ణ అంటే మీకు తెలిసిందే కదా ఒక దాహం, తపన. ఇది కమర్షియల్ ఇన్‌స్టిట్యూట్ కాదు. నేను ఆసక్తి ఉన్న పిల్లలకు నేర్పిస్తాను. ఒక టీచర్ ను పెట్టి వంద మంది పిల్లలకు నేర్పించడం నాకు ఇష్టం లేదు.  ఇన్‌స్టిట్యూట్‌కు కొంతమంది విద్యార్థులు ఆసక్తితో ఒక నెల వస్తారు మళ్లీ మానేస్తారు. కొంతమంది తల్లిదండ్రులు మా పిల్లలు వెంటనే స్టేజీ ఎక్కిపోవాలనుకుంటారు. కానీ అది సాధ్యం కాదు. ఇదొక సాధన. అందుకే తల్లిదండ్రులు రాగానే చెప్తాను. మీరు ఇవాళ తీసుకొచ్చి ఆరునెలల తర్వాత మా అమ్మాయి స్టేజీ ఎక్కుతుందా? అంటే అది కాదు. ఒక్కొక్క విద్యార్థికి ఒక్కో విధమైన శక్తి సామర్థ్యం ఉంటుంది. ఇప్పుడు రెండు ప్రాజెక్ట్స్ పెండింగ్‌లో ఉన్నాయి. 2024లో మరో రెండు కొత్త ప్రదర్శనలు ఇస్తాను. నా చివరి ప్రొడక్షన్ మండోదరి. తర్వాత  2022లో వారియర్ ఉమెన్ ఆఫ్ భారత్ అని ఏడు నృత్య రూపకాలను కలిపి చేశాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ని పురస్కరించుకొని చేశాం. రీసెంట్‌గా రష్యాలోని మాస్కో నగరంలో ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శన ఇచ్చాం. సో అదొక ప్రొడక్షన్. మండోదరి, రుద్రమదేవి, నాయకి, లకుమ, సత్యభామా విలాసం, అలిమేలు మంగా విలా సం, దుర్గాసుర సంహారం, ద్రౌపది, చిత్రకూట మహ త్మ్యం, ఆండాళ్ కళ్యాణం వంటి పలు పురాణ పాత్రల ఆధారంగా నృత్య ప్రదర్శనలు చేశాను. ఇప్పుడంతా రాముణ్ని స్మరించుకుంటున్నాం. గత నెల గౌహటిలో సంగీత్ నాట్య అకాడమీ ఫెస్టివల్ అయితే రాముడి మీద థీమాటిక్ ప్రదర్శన ఇచ్చాను. అలా ఏదో ఒకటి కొత్తగా నడుస్తూనే ఉంటుంది. 

కూచిపూడికి ఆదరణ ఎలా ఉంది?

కూచిపూడికి ఆదరణ ఉంది. కానీ గవర్నమెంట్ దానికి ఒక గుర్తింపు, అండ ఇవ్వడం చాలా అవసరం. అప్పుడే కళలు బతకడానికి వీలుంటుంది. ఒక ఆర్టిస్టు బతకాలంటే ఫైనాన్సియల్‌గా ఒక దారి ఉండాలి కదా. మ్యూజీషియన్స్ ఉన్నారు.. వాళ్ళు కేవలం ఒక ప్రదర్శన చేసి వాటితో వచ్చే డబ్బులతో బతకగలుగుతారా? అంటే అది చాలా కష్టం. ఆర్టిస్టులకు ప్రమోషన్స్, ప్లాట్‌ఫామ్స్ ఉండాలి. పుట్టగానే ప్రొఫెషనల్‌గా పుట్టరు కదా. ఎక్కడో ఒక దగ్గర మొదలు పెడతారు. బాగా చేసే వాళ్ళను ప్రోత్సహిస్తుంటే.. వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు.. పైకి ఎదుగుతారు. ఆ సిస్టమ్‌ను డెవలప్ చేయాలి. చెన్నైలో ప్రతి ఏడాది డిసెంబర్, జనవరిలో పండుగలు అయినప్పుడు పిల్లలను ప్రోత్సహిస్తుంటారు. పిల్లలు సాధన చేస్తున్న కొద్ది ఇంకా మంచి ప్రదర్శన ఇవ్వగలుతారు. అవకాశమే లేనప్పుడు వాళ్ళు ఏం బెటర్ అవుతారు చెప్పండి? ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుంది కదా. సాధన ఉన్నప్పుడే అభివృద్ధి కనిపిస్తుంది. అభివృద్ధి చెందుతున్న కొద్దీ అవకాశాలు వస్తాయి. ఇది ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. ఒక ఆర్ట్ బతకాలంటే క్వాలిటీ ఉండాలి కదా. నాలుగు కాలాల పాటు అది నిలదొక్కుకోవాలి అంటే దానికొక సత్తా ఉండాలి. అన్ని సంస్థలు, గవర్నమెంట్ కలిసి పని చేస్తే ఇంకా మంచి చేయొచ్చని నా అభిప్రాయం. 

మీ అభిరుచుల గురించి?

నాకు సంగీతం ఇష్టం. నాకు సమయం దొరికితే కుటుంబంతో గడపడం ఎక్కువ ఇష్టం. కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంకా మొక్కలు అంటే చాలా ఇష్టం. ప్రకృతితో గడపడం అనేది నాకు ప్రశాంతతను ఇస్తుంది. నా ఆర్ట్‌కు ప్రకృతికి దగ్గరి సంబంధం ఉందనిపిస్తుంది. ప్రకృతితో గడిపితే ఏదో తెలియని శక్తి వస్తుంది.

విద్యార్థులకు మీరిచ్చే సలహా? 

ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మా కాలంలో అయితే ఒక చదువు, లేదంటే డ్యాన్సంటే డ్యాన్స్ మాత్రమే ఉండేది. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. ఇవాళ రేపు మైండ్ సెట్ ఎట్లా అంటే క్విక్ రిజల్జ్ రావాలి. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ప్లానింగ్, సుదీర్ఘ సాధన ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఒక లెవల్ వెళ్ళే అవకాశం ఉంది. ఇవాళ నేర్చుకున్నాం పట్టుమని నాకు పేరు రావాలి అంటే ఎట్లా వస్తది?. సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. దీనికి చాలా టైమ్ పడుతుంది. ఆ టైమ్ తీసుకోవడం అన్నది ఇవాళ, రేపు పిల్లలకు ఇష్టం లేదు. చాలామంది తల్లిదండ్రులు ఇది టైమ్ వృథా అనుకుంటారు. కానీ ఇది టైమ్ వృథా కాదు. ఇది ఒక గంట ప్రాక్టీస్ చేస్తే చాలు ఏకాగ్రత బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇది కూడా ఒక మెడిటేషన్ లాంటిదే. డ్యాన్స్ ఇచ్చినంత ఫిజికల్ ఎక్సర్‌సైజ్ దేంట్లోను ఉండదు. ఒక క్షణంలో ఒక కాలు, చెయ్యి, కనుబొమ్మలు, మన ముఖం అన్నీ ఒకేసారి కదపాలి. చదువు అనగానే ఒక కాంపిటిషన్ కాదు. నీకు ఎన్ని మార్కులు వచ్చినవి. నాకు ఎన్ని మార్కులు వచ్చినవి.. నీకే ర్యాంక్ వచ్చింది.. నాకెందుకు ఈ ర్యాంకు వచ్చింది. ఇవన్నీ నాకు బాగా అనిపించవు. ఇవి పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి.    

ఇన్ని బాధ్యతలను ఎలా నిర్వహించగలిగారు? 

నాకు వేరే చాయిస్ లేదు. నేను డ్యాన్స్ చేయాలి. నేను ఇది మానేయ్యలేను. అది మానేస్తే అలేఖ్య ఉండలేదు. డ్యాన్స్ నా ఫ్యాషన్ కదా. నా ఉనికి. దాన్ని ఒదిలిపెడితే నేను బతకలేను. ఇవన్నీ చేయాలంటే నేను బతకాలి కదా. నా శక్తికి మించి నేను ముందుకు సాగాను. డెలీవరి తర్వాత పిల్లల బాధ్యతలు పెరుగుతాయి. శారీరకంగా మార్పులు వస్తాయి. అవన్నీ అధిగమించుకొని స్టేజీపైకి ఎక్కి మళ్లీ ప్రదర్శనలు ఇచ్చాను. రెండో బాబు పుట్టాక వాణ్ని యూనివర్సిటీకి తీసుకెళ్లి స్టాఫ్ రూమ్‌లో పడుకోబెట్టి క్లాస్‌లు చెప్పేదాన్ని. దానికి మా స్టాఫ్ సపోర్టు చేసేవారు. మా అమ్మగారు నేను ఇది చేయలేను అనే మానసిక స్థితికి నన్ను ఎప్పుడూ తీసుకురాలేదు. అలా కష్టపడ్డాను కాబట్టి ఇవాళ ఈ పోజిషన్‌లో ఉన్నాను. మనకు కచ్చితంగా ఏదో ఒక ఫ్యాషన్ ఉండాలి. అప్పుడే ఏదో ఒకదారి వెతుక్కుంటాం.

ఒక మంచి సందర్భం గురించి చెప్పండి?

నాకు బాగా సంతోషాన్ని, దుఃఖాన్ని మిగిల్చింది కూడా నా అరంగేట్రం. ఎందుకంటే నాన్నగారు లేరు అనే బాధ. అప్పుడు అరంగేట్రం అంటే ఒక పెద్ద ఈవెంట్ మా జీవితంలో. అంటే ఒక ఆర్టిస్టుగా జనానికి పరిచయం అవుతున్నాం. సో అదొక పెద్ద ఈవెంట్ నా లైఫ్‌లో. 1977 తర్వాత స్టేట్ అవార్డు హంస, రాజీవ్ పురస్కారం, ఉగాది విశిష్ట పురస్కారం ఇవన్నీ ఒక ఎత్తు అయితే,  నాకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అంటే మాములు విషయం కాదు కదా. కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని  జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. నేను అరంగ్రేటం చేసినప్పుడు, పెళ్లి అప్పుడు నాన్న గారు లేకపోవడం అత్యంత బాధకరం.

మీది లవ్ మ్యారేజ్ అని విన్నాం? నిజమేనా? 

మా వారు నన్ను డ్యాన్స్ చేసేటప్పుడు చూశా రు. అంటే వాళ్ళ సిస్టర్ కూడా డ్యాన్స్ నేర్చుకునేది. సో మేం ఇద్దరం మంచి స్నేహితులం కూడా. మా గురువు గారి దగ్గరే ఆవిడ జాయిన్ అయినప్పుడు తరచూ ఆమెను డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు చూసేవారు. ప్రోగ్రామ్స్ చూశారు. ఇష్టపడ్డారు, పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. మా అమ్మ దగ్గరకు వచ్చి చెప్పారు నేను పెళ్ళి చేసుకుంటానని. అలాగ ప్రేమ పెళ్లిగా మారింది. వారిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. మామయ్య పుంజాల శివశంకర్. ఇందిరాగాంధీ కేబినేట్‌లో మంత్రిగా పనిచేశారు. నా భర్త వినయ్‌కుమార్ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యనిపుణులు. మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దబ్బాయి శాశ్వత్ రాంశంకర్ న్యాయవాది వృత్తిలో ఉన్నారు. కోడలు సంజన కూడా న్యాయవాది. చిన్నబ్బాయి దేవాన్ష్ కృష్ణశంకర్ అమెరికాలో చదుకున్నారు. ప్రస్తుతం దేవాన్ష్ బిజినెస్ చేస్తున్నారు. 

ప్రమోషన్స్ ఏమైనా వచ్చాయా?

ప్రమోషన్స్ అంటే తెలంగాణ స్టేట్  ఛైర్ పర్సన్ ఆఫ్ సంగీత నాటక అకాడమీ. ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ నడుస్తుంది కాబట్టి కాస్త ఆలస్యం అయింది. ఎలక్షన్ అయిపోగానే ఐ విల్ టేక్ చార్జ్. ఎలక్షన్స్ లేకపోతే ఏప్రిల్ నెలలోనే బాధ్యతలు అప్పగించేవారు. 

 రూప