14-12-2025 12:14:01 AM
సూర్యాపేట, డిసెంబర్ 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నవ న్నీ హత్యా రాజకీయాలేనని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. శనివారం నల్లగొండ బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన స్థానిక సంస్థల ఎన్నికలు చాలా దారుణంగా మారాయని, అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వైపు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు మరో వైపు ఉన్న ట్టు పరిస్థితి తయారైందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఎన్నికల్లో నామినేషన్ వేసే బీఆర్ ఎస్ అభ్యర్థులను కాంగ్రెస్ నాయకులు భ యబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎక్కడా రాజకీ య ఘర్షణలకు తావు లేదని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి చోట ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని అ న్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రుల పీఏలు నిత్యం పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నారని, బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.
సూర్యాపేట జిల్లా లోని నాలుగు నియోజకవర్గాల్లో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పని చేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో హోం గార్డ్‌లు కూడా ఎస్పీలను లెక్కచేయని పరిస్థితి నెలకొందన్నారు. బీఆర్‌ఎస్ నేతలు గెలిచిన చోట రీ కౌంటింగ్ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. చిన్నకాపర్తిలో బీఆర్‌ఎస్‌కు వేసిన ఓట్ల బ్యాలెట్ పేపర్‌లు డ్రైనేజీలో ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా త యారయ్యిందో అర్థం చేసుకోవచ్చన్నారు.
బీఆర్‌ఎస్‌కు గ్రామస్థాయిలో పటిష్ఠమైన వ్యవస్థ ఉందని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రెగట్టే మల్లికార్జునరెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పాల్గొన్నారు.