28-01-2026 12:00:00 AM
కమిషనర్‌కు వెల్లడించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి, జనవరి 27(విజయక్రాంతి): రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లకు దిశా నిర్దే శం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు. జిల్లాలో 11 మున్సిపాలిటీలలోని 256 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాలు సిద్ధం చేశామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. నోడల్ అధికారులు తమ తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. నామినేషన్ సెంటర్లలోని అన్ని గదులకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అలాగే నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.
నోటిఫికేషన్ వెలువడినందున వెంటనే ఎంసీసీని అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు, అడిషనల్ కలెక్టర్ పాండు, మున్సిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులు, ఎన్నికల విభాగపు సిబ్బంది పాల్గొన్నారు.