06-12-2025 12:00:00 AM
--జిల్లా కేంద్రంలో మూడు పరీక్ష కేంద్రాల ఏర్పాటు
--పరీక్ష రాయనున్న 515 మంది విద్యార్థులు
--జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ మహేందర్
ములుగు,డిసెంబర్5(విజయక్రాంతి):ములుగు జిల్లాలో నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని, జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాలలో 515 మంది విద్యార్థులు పరీక్ష వ్రాయనున్నారని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్ జి తెలిపారు. శుక్రవారం అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి తన ఛాంబర్ లో జవహర్ నవోదయ విద్యాలయ అధికారులు, సంబంధిత అధికారులతో పరీక్ష ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్ జి మాట్లాడుతూ మామునూరు జవహర్ నవోదయ విద్యాలయ వరంగల్ జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరంలో ఆరవ తరగతిలో ప్రవేశం కొరకు డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుందని అన్నారు.ములుగు జిల్లాలో ప్రవేశ పరీక్ష కోసం ఏటూరునాగారంలోని జెడ్పి హెచ్‌ఎస్ పాఠశాలలో 162 మంది విద్యార్థులు ,ములుగు బండారుపల్లి ఆదర్శ పాఠశాలలో 192 మంది విద్యార్థులు ,ములుగు జడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో 161 మంది విద్యార్థులు ,మొత్తం మూడు పరీక్షా కేంద్రాలలో 515 విద్యార్థులు పరీక్ష వ్రాయనున్నారని, ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు www.navodaya.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్ దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారు విద్యాలయ హెల్ప్ లైన్ నెంబర్ 9110782213 కి ఫోన్ చేసి తమ వివరాలు తెలిపి హాల్ టికెట్ ను పొందవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంటుందని,విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలని ఆయన తెలిపారు.