04-07-2025 08:35:25 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,(విజయక్రాంతి) : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్యతో కలిసి జిల్లా అధికారులు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల ప్రిన్సిపాళ్ళతో విద్యార్థులకు కల్పించవలసి సదుపాయాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి అసౌర్యం కలుగకుండా పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యాబోధన చేయాలని తెలిపారు. విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ సకల సౌకర్యాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రైవేట్ భవనాలలో కొనసాగుతున్న పాఠశాలలు, వసతి గృహాలకు సొంత భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలోని మైనార్టీ సంక్షేమ, ఆశ్రమ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ, మహాత్మా జ్యోతిబా పూలే, కస్తూరిభా గాంధీ విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, గిరిజన సంక్షేమ వసతి గృహాల వారిగా సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆయా విద్యా సంస్థలలోని మంజూరైన విద్యార్థుల సంఖ్య, ప్రస్తుతం ఉన్న విద్యార్థులు, పాఠశాల భవన స్థితి, వసతి గదులు, పడకలు, మూతశ్రాలలు, శౌచాలయాల వివరాలను పరిశీలించారు. నూతన మెనూ ప్రకారం సకాలంలో విద్యార్థులు పౌష్టికాహారం అందించాలని, వంట చేసే సమయంలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర సరుకులు మాత్రమే వినియోగించాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని, ప్రతి రోజు వసతి గదులు, వంటశాల, మూత్రశాలలు, పరిసరాలను శుభ్రపరచాలని, విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.