02-05-2025 02:00:51 AM
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందేందుకై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కోఒన్నారు. కులగణన చేస్తానని చెప్పిన ప్రధాని మోదీకి, కులగణన చేయాలని ఒత్తిడి తీసుకొచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డిని గురువారం ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. బీసీ ఉద్యమానికి అండగా నిలిచిన సీఎం రేవంత్‌రెడ్డిని అభినందించారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని దేశవ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల రెండో వారంలో ఢిల్లీలో అఖిలపక్ష పార్టీల మేధావులతో సమావేశం నిర్వహిస్తామని, మూడో వారంలో కులగణనకు మద్దతుగా నిలబడిన పార్టీలను, కులగణన చేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తామని జాజుల శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు.
బీసీలకు జనాభా ఆధారంగా విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో రాజ్యాంగబద్ధమైన వాటా దక్కేవర కు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి, కన్వీనర్ బాలగోని బాలరాజ్‌గౌడ్, పూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్‌తో పాటు బీసీ సంఘాల నాయకులు కల్కచర్ల శ్రీనివాస్, తాటికొండ విక్రమ్, కనకాల శ్యామ్, మనిమంజరి, వేముల వెంకటేశ్ తదితరులు ఉన్నారు.