calender_icon.png 2 May, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాంగ్‌మోడల్ మాకొద్దు!

02-05-2025 12:40:17 AM

  1. తెలంగాణ కులగణన మోడల్ పరిగణనలోకి తీసుకోం..
  2. మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లి సమగ్ర జనగణన చేస్తాం
  3. కులగణనపై మోదీ నిర్ణయం చరిత్రపుటల్లో నిలుస్తుంది 
  4. ముస్లింలను బీసీల్లో చేర్చేది లేదు.. 
  5. కాంగ్రెస్ పార్టీకో, రాహుల్‌గాంధీకో భయపడి నిర్ణయాలు తీసుకోం
  6. న్యూఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): తెలంగాణలో కులగణన రాంగ్ రోల్ మోడల్ అని, అది తమకు అవసరం లేదని, మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి.. సమగ్రంగా జనగణన చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశా రు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ బీసీ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధితో పనిచేయలేదన్నారు.

జనగణనలో కులగణన చేయా లని తీసుకున్న ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం చరిత్రపుటల్లో నిలిచిపోతుందని కిషన్‌రెడ్డి కొనియాడారు. కులగణనపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షపార్టీలు  రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నాయని మండిపడ్డారు. గురువారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రివర్గానికి ధన్యవాదాలు తెలిపారు.

కులగణనపై కేంద్రం నిర్ణ యం తీసుకున్నాక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. 2026లో జనగణన మొదలయ్యే అవకాశం ఉంటుందని, ఏపీహైకోర్టు ఇచ్చిన తీర్పునకు కట్టుబడే కులగణన ఉంటుందని తెలిపారు. 

తెలంగాణ కులగణనలో చిత్తశుద్ధి లేదు..

మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని తమ ఘనత అన్నట్లు రాహుల్ గాంధీ చెప్పుకోవడం సిగ్గుచేటని, రాహుల్ గాంధీకో, కాంగ్రెస్ పార్టీకో భయపడి బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోలేదన్నారు. తెలంగాణ, కర్ణాటకల్లో రాష్ట్రాల్లో చేపట్టిన కులగణన కూడా హడావుడిగా.. ఏదో సాధించామని చెప్పుకునే ప్రయత్నం చేశారు తప్ప.. ఇందులో చిత్తశుద్ధి లేదన్నారు. కులగణన చేయాలంటే.. విధానపరమైన నిర్ణయాలు చాలా తీసుకోవాల్సి ఉంటుందని, 50 శాతం జనాభాను కూడా చేరుకోకుండా మొత్తం సర్వే పూర్తి చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

కులాల పేరిట విచ్ఛిన్నం చేసే కుట్ర..

దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజలను మతం పేరుతో విడగొడుతు, మతఘర్షణలు సృష్టించిన కాంగ్రెస్‌పార్టీ కులాల పేరుతోనూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేసిందన్నారు. గతంలో ముస్లింలందరినీ బీసీల్లో చేర్చారని, తమ ప్రభుత్వం ముస్లింలో చేర్చబోదని కిషన్‌రెడ్డి చెప్పారు.

కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ, ఎస్టీలపై, బీసీలపై కపటప్రేమను చూపించడం తప్ప వారికి న్యాయం చేయాలనే ఆలోచన ఉండదన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్యను పరిష్కరించేందుకు..మోదీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పూర్తివివరాలు అందజేసిందని ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. 

వెనకబడినవర్గాలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు..

వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఏనాడూ పనిచేయలేదన్నారు. 2018లో జాతీయ బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానికే దక్కుతుందని, 2019లో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకోసం 10 శాతం రిజర్వే షన్‌ను అమల్లోకి తీసుకొచ్చామన్నారు.

దేశంలో బీసీలకంటే ముస్లింలు విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్నారని, వారికి చేయూత అందించాలన్నారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. 2010లో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కులగణనపై మంత్రులతో సబ్‌కమిటీ వేయడంతో.. అప్పుడే బీజేపీ పక్షనేత సుష్మాస్వరాజ్ తమ పార్టీ కులగణనకు అనుకూలంగా ఉన్నదని  లేఖ రాసినట్లు చెప్పారు. కానీ, 2011లో జనగణనతో పాటుగా కులగణన చేయడాన్ని నాటి హోంమంత్రి చిదంబరం వ్యతిరేకించారని కిషన్‌రెడ్డి తెలిపారు.