calender_icon.png 19 May, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదాతపైనే హమాలీ భారం

02-05-2025 12:00:00 AM

ఏండ్ల తరబడి ఛార్జీలు అందని వైనం

ఈ ప్రభుత్వమైనా చెల్లించాలని అన్నదాతల వేడుకోలు

సూర్యాపేట, మే 1 (విజయక్రాంతి): ఏటా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను చేపడుతున్నా హమాలీ ఛార్జీలను మాత్రం రైతులకు ఇవ్వటం లేదు. సుమారు ఎనిమిదేళ్లేగా చెల్లింపుల ఊసే లేకపోవటంతో జిల్లాలో రూ.కోట్లాదిగా పెండింగులో పడిపోయాయి. గన్నీ సంచులు ప్రభుత్వం సమకూర్చుతుండగా పురికోలను రైతులే  సమకూర్చుకుంటున్నారు. హమాలీ ఖర్చుల కింద క్వింటాలుకు రూ.32 చొప్పున రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. తూకం వేసి లారీలో బస్తాలు ఎక్కించగానే హమాలీలకు అన్నదాతలే డబ్బు ఇచ్చేస్తున్నారు. సీజన్ ముగిసిన నెల రోజులకు కొనుగోలు కేంద్రాలు నిర్వహించిన ఏజెన్సీలు చెల్లించాలనే నిబంధనలు అమ కావడం లేదు.

ప్రాంతాన్ని బట్టి క్వింటాలు ధాన్యానికి రూ.55 నుంచి రూ.80 వరకు హమాలీ ఖర్చులను రైతులు భరిస్తున్నారు. ప్రభుత్వం నామమాత్రంగా ఇస్తోంది. నెల తర్వాత ఏజెన్సీల నుంచి ఖర్చులు రాబట్టుకోవాలనే విషయం చాలామంది రైతులకు తెలియదు. ఏజెన్సీల గ్రూపుల్లో అధ్యక్షులు దిగిపోయి కొత్తవారు వస్తారు. ఎవరైనా అడిగినా తమకు తెలియదని చెబుతుంటారు.  ఈ యాసంగి సీజన్ లోనైనా ప్రభుత్వం హమాలీ చార్జి చెల్లిస్తుందేమోనని రైతులు ఆశపడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

2017 తరువాత అందని చార్టీలు

జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్ లో 286 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 4.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఆయా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే గోనెసంచుల్లో వడ్లను నింపి లారీల్లో ఎత్తే హమాలీ ఖర్చును జిల్లాలో రైతులే భరిస్తున్నారు. ఈ సెంటర్లను నెలకొల్పిన తొలినాళ్లలో 2014, 2017 సీజన్లలో ప్రభుత్వం చెల్లించింది. మొదటగా రైతులు ఇస్తే వడ్ల బిల్లులు పడే సమయంలోనే హమాలీల డబ్బులను క్వింటాకు రూ.32 చొప్పున ప్రభుత్వం చెల్లించింది. ప్రస్తుతం అధికారులు ఈ లెక్కలు ప్రభుత్వానికి పంపుతున్నా.. డబ్బులు అందడం లేదు

ప్రతి ఏడు  రైతులపై భారం

వడ్ల కాంటా సమయంలో రైతులకు హమాలీల ఖర్చు విపరీతంగా ఉంటుంది. మొదట్లో క్వింటాకు రూ.30లకు వేసిన హమాలీలు సీజన్ సీజన్ కు పెంచుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో కొన్నిచోట్ల క్వింటాకు రూ.50ల వరకు వసూలు చేస్తున్నారు. ఇదే కాకుండా ఉల్పాల పేరుతో వడ్లను బట్టి అదనంగా మరో రూ.500 నుంచి రూ.3వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఎకరం సాగు చేసిన వారికి హమాలీ ఖర్చు మొత్తంగా రూ.వెయ్యి నుంచి రూ. 1,500 వరకు అవుతుందని రైతులు వాపో తున్నారు. జిల్లాలో ఈ సీజన్ లో  4.07 లక్ష ల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. ఈ లెక్కన హమాలీల ఖర్చు రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు రైతులపై భారం పడుతోంది. ఇలా ప్రతి సీజన్లోనూ రూ.20 కోట్ల వరకు హమాలీ చార్జీల రూ పంలో రైతులపై ఆర్థికభారం పడుతోంది.