02-05-2025 12:51:53 AM
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచనను వీడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీ సీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయని స్తోందని అన్నారు. ఇది మీ సంస్థ.. దీన్ని కాపాడుకునే బాధ్యత ఆర్టీసీ కార్మికుల పైనే ఉందని సీఎం స్పష్టంచేశారు.
గత పదేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక దోపిడీ జరిగిందని, ఆర్టీసీ కార్మికులు పంతాలు, పట్టింపు లకు పోవద్దన్నారు. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత మంత్రితో చర్చించాలని, వచ్చే ఆదాయం మీ చేతిలో పెడతాం ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయాలన్నారు. గురువారం ప్రపంచ కార్మిక దినో త్సవం మేడే సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లా డుతూ, ప్రపంచంలో ఎన్ని ఉద్యమాలు వచ్చినా కార్మికుల ఉద్యమం ప్రత్యేకమైనదని అన్నారు. తెలంగాణ సాధనలో సింగ రేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికులు, అసంఘటిత కార్మికుల పాత్ర మరువలేనిదని చెప్పారు.
తెలంగాణ కార్మికులను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధ్దం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు సీఎం తెలిపారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇచ్చి, బోనస్ ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వానిదేనని చెప్పారు. గత పదేళ్ల నిర్లక్ష్యంతో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి వచ్చిందని, ఒక పద్ధతి ప్రకారం నష్టాలను నివారిస్తూ ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు.
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, కార్మికులకు మేలు చేయడమే మా ప్రభుత్వ విధానం అని చెప్పారు. అసంఘటిత కార్మికుల కోసం గిగ్‌వర్కర్స్ పాలసీని త్వరలోనే తీసుకురాబోతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది దేశానికి రోల్ మాడల్ కానున్నదని చెప్పారు.
గత ప్రభుత్వం కార్మికుల పట్ల వివక్షత వివక్ష చూపిందని, ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణిచివేసి 50 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారని విమర్శించారు. గత పదేళ్లలో విధ్వంసం జరిగిందని, గత పాలకులు 50వేల కోట్ల కాంట్రాక్ట్ బిల్లులు పెండింగ్‌లో పెట్టారని సీఎం రేవంత్ అన్నారు. 1లక్షా 20వేల కోట్లు ఇతర విభాగాల్లో పెండింగ్‌లో పెట్టి వెళ్లినట్లు చెప్పారు.
సర్పంచులకు బకాయిలు గత ప్రభుత్వ ఘనకార్యమేనని, మేం అధికారంలోకి వచ్చే నాటికి 8లక్షల 29వేల కోట్లు మా చేతికి అప్పు పెట్టి వెళ్లినట్లుగా సీఎం తెలిపారు. కేసీఆర్ చేసిన అప్పుల వడ్డీలు చెల్లించేందుకే రూ. 1.58 లక్షల కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రం అప్పుల పాలైతే.. కేసీఆర్ కుటుంబాని పత్రికలు, ఛానళ్లు, ఫాంహౌస్‌లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలిందని విమర్శించారు.
ఆర్ధిక స్థితిని మెరుగుపర్చేందుకు తాను సహచర మంత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు సీంఎ చెప్పారు. ఆర్టీసీని కాపాడేందుకు అణా పైసా తాను ఇంటికి తీసుకెళ్లనని, మీ కోసమే ఖర్చు చేస్తానని సిఎం రేవంత్ అన్నారు. సమ్మెపోటు రాష్ట్రానికి నష్టం చేస్తుందని, ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబ సభ్యులన్నారు. ఆర్ధిక వ్యవస్థ పట్టాలెక్కుతోందని, మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుందని సీఎం వెల్లడించారు.
పదేళ్లు ఏం చేయనివారి వలలో కార్మికులు పడొద్దని, వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దని సూచించారు. కేసీఆర్ చేసిన గాయాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదని, అసెంబ్లీకి మీరు పంపిన పిల్లలు ఇష్టారీతినా మాట్లాడుతున్నారని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల నైపుణ్యాలు పెంచేందుకే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.