02-05-2025 12:44:19 AM
హైదరాబాద్, మే 1(విజయక్రాంతి): తెలంగాణలో చేపట్టిన కులగణన దేశానికి రోల్‌మోడల్ అని, తెలంగాణ మో డల్‌ను కేంద్రప్రభుత్వం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కులగణన విష యంలో ప్రతీ రాష్ట్రంతో మాట్లాడి ఆయా రాష్ట్రప్రభుత్వాల సూచనలను కూడా తీసుకోవాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. అయితే కుల గణన ఎప్పుడు ప్రారంభిస్తారు..? ఎప్పుడు పూర్తిచేస్తారో తేదీలు ప్రకటించాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
కులగణన ఎక్స్‌రేలాంటిదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారని సీఎం గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, షబ్బీర్‌అలీ, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరుల తో కలిసి మీడియాతో మాట్లాడారు.. కులగణన విషయంలో ఆలస్యమైనా కేంద్రం ఒక మంచి నిర్ణయం తీసుకుందన్నారు.
ఈ విషయంలో తమ అను భవాలను కేంద్రంతో పంచుకుంటామన్నారు. 1931 తర్వాత దేశంలో తొలిసా రి తెలంగాణ కులగణన చేపట్టిందని, 56 శాతం బీసీలు ఉన్నట్లు తేలిందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగాలని సీఎం ఆకాంక్షించారు.
కులగణన విషయం లో కేంద్ర మంత్రుల కమిటీ ఏర్పాటుచేయాలని, ఆ కమిటీలో కేంద్రమంత్రులతోపాటు సీనియర్ అధికారులను నియమించాలన్నా రు. కులగణన విషయంలో కేంద్రంపై విమర్శలు చేయడం తనకు ఇష్టం లేదన్నారు.
కులగణన విషయంలో అన్ని రాష్ట్రాలకు నిపుణుల కమిటీ పంపాలని, కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని సీఎం పేర్కొన్నారు. ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని, కులగణన పూర్తయ్యాక ఏం చేస్తారో చెప్పాల న్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం ఒక్కో జాబితాలో ఉందని, ఈ చిక్కుముడులన్నీ విప్పుకుంటూ ముందుకు సాగాలన్నారు.
రాహుల్‌గాంధీకి అభినందనలు..
‘కులగణన చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ విషయంలో మొదట రాహుల్ గాంధీకి అభినందనలు చెప్పాలి. కులగణన కోరుతూ రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4 వేలకిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అప్పుడే కులగణనపై రాహు ల్‌గాంధీ ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చా రు.
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ అధికారంలోకి రాగానే రాహుల్‌గాంధీ హామీ, సూచనల మేరకు రాష్ట్రంలో కులగణన చేశాం. మం త్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌తో కలిసి కమిటీ వేశాం. కులగణన, బీసీలకు 50 శాతం కంటే ఎక్కువగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరాం. విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి..దేశానికి మార్గదర్శకంగా నిలిచాం. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించాం. ’ అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.
మేం హింసకు వ్యతిరేకం..
ఆపరేషన్ కగార్‌పై మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం స్పందిస్తూ .. తాము హింసకు వ్యతిరేకమన్నారు. ఎంతపెద్ద సమస్యకైనా చర్చలే అంతిమ పరిష్కారమన్నారు. మావోయిస్టులతో చర్చలు జరపాలన్నదే తమ ఆలోచన అని సీఎం స్పష్టంచేశారు. త్వరలోనే పార్టీ అధిష్ఠానంతో చర్చించాక తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు.
సీఎంకు అభినందనల వెల్లువ..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయకులు, వివిధ కులసంఘాల నేతలు అభినందనలు తెలిపారు. తెలంగాణలో కులగణన చేయడం వల్లే.. కేం ద్రంపై ఒత్తిడి పెరిగి ప్రధాని మోదీ జనగణనలో కులగణన చేయాలని నిర్ణయం తీసు కున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీ హనుమంతరావు, కే కేశవరావు, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజు ల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు అన్నారు. సీఎంను కలిసి అభినందించిన వారిలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, రాజ్‌ఠాకూర్, వాకిటి శ్రీహరి, షబ్బీర్‌అలీ, నిర్మలా జగ్గారెడ్డి, గుండు సుధారాణి పాల్గొన్నారు.
తెలంగాణ అనుభవం ఉపయోగపడుతుంది..
తెలంగాణలో చేపట్టిన కులగణన విషయంలో ప్రజాసంఘాల ప్రతినిధులను సంప్రదించి ప్రశ్నపత్రం తయారు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 8పేజీల్లో 57 ప్రశ్నల ద్వారా వివరాలు సేకరించామని, ఈ విషయంలో తెలంగాణ అనుభవం కేంద్రానికి ఉపయోగపడుతుందని సీఎం చెప్పారు. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా కుల గణన చేప ట్టామని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచామన్నారు.
నాలుగు వందల సీట్లిస్తే రాజ్యాంగాన్ని మార్చేవారు..
గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 400 ఎంపీ సీట్లు ఇస్తే ప్రధాని నరేంద్రమోదీ రాజ్యాంగాన్ని మార్చేవారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తాము ఆ ప్రమాదాన్ని ముందే పసిగట్టి ప్రజలకు వివరించామని, అందుకే బీజేపీకి సీట్లు తగ్గడంతో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. కాంగ్రెస్ పార్టీగా కులగణన చేయాల్సిన అనివార్యతలోకి మోదీని నెట్టివేశామన్నారు.
రాష్ట్ర బీజేపీ నేతలకు ఏమి చేయాలో తోయక తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, రేవంత్‌రెడ్డి విధానాలను మోదీ అనుసరిస్తున్నారనే బాధ వారిలో కనిపిస్తోందన్నారు. రాహుల్‌గాంధీ ఆలోచనను ప్రధాని మోదీ ఆదర్శంగా తీసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. గాంధీ అనుకున్నది సాధించినట్లే..రాహుల్‌గాంధీ కూడా ఏదో ఒక రోజు అనుకున్నది సాధిస్తారని ఆకాంక్షించారు.
మోదీ పిలిస్తే వెళ్లి, సలహాలు, సూచనలు అందిస్తామన్నారు. కేసీఆర్ కుటంబం కులగణనలో తమ పేర్లను నమోదుచేసుకోలేదని మీడియా ప్రశ్నించగా, సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు నమోదు చేసుకోని వారు జనాభాలో లేనట్లేనని గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.