02-05-2025 12:00:00 AM
మహబూబాబాద్, మే 1 (విజయ క్రాం తి): పది మాసాల పాటు కష్టనష్టాలకోర్చి పండించిన పసుపు కు సరైన గిట్టుబాటు ధర లభించక, ఏటేటా సాగు విస్తీర్ణాన్ని తగ్గించిన రైతన్నకు ఇప్పుడు పసుపు ధర పెరగడం ఓవైపు సంతోషం కలిగిస్తున్నప్పటికీ మరోవైపు విస్తీర్ణం తగ్గించి, ఆశించిన దిగుబడి రాక నిరుత్సాహానికి గురవుతున్నారు. గత ఏడాది జూన్ మాసంలో సాగు చేసిన పసుపు పంట భూమి నుంచి తీసి ఉడికించి శుద్ధిచేసి మార్కెట్ కు తెస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ తర్వాత పసుపు సాగులో ఉమ్మడి వరంగల్ జిల్లా ద్వితీయ స్థానంలో నిలుస్తోంది. అందులో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ప్రాంతంలో ‘సాంప్రదాయ’ పంటగా పసుపు సాగుకు పెట్టింది పేరుగా నిలిచేది. పసుపు వేయడం నుంచి తిరిగి భూమిలో నుంచి తీయడం ఆ తర్వాత ఉడికించడం, పాలిషింగ్ చేసి మార్కెట్ తీసుకెళ్లి విక్రయించేంత వరకు రైతులు అహర్నిశలు కష్టపడాల్సి వచ్చేది.
పదేళ్ల క్రితం వరకు ఒక్క కేసముద్రం మండలంలోనే పదివేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పసుపు సాగు చేసేవారంటే ఈ ప్రాంతంలో పసుపు సాగు పై రైతులకు ఎంత మక్కువ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. పసుపు సాగు విస్తీర్ణం అధికంగా ఉండడంతో పాటు పంట కూడా అదే స్థాయిలో దిగుబడి ఇవ్వడంతో అప్పట్లో ఇక్కడ పసుపు ప్రాసెసింగ్ యూనిట్లు, పసుపు పౌడర్ మిల్లులు నెలకొల్పడం వల్ల వందల మంది కూలీలు కార్మికులకు ఉపాధి లభించేది.
కేసముద్రం ప్రాంతం నుండి దేశంలోని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు పసుపు ఎగుమతి జరిగేది. 2015 వరకు ఈ ప్రాంతంలో పసుపు సాగు ఆశించిన విధంగానే జరిగేది. దీనితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పసుపు కు కేర్ అఫ్ అడ్రస్ గా కేసముద్రం ప్రఖ్యాతి గడించింది.
అయితే పది మాసాల పాటు అష్ట కష్టాలకోర్చి పసుపు పంట పండిస్తే, క్వింటాలకు కనీసం 10 వేల రూపాయల ధర లభించని పరిస్థితి తలెత్తడంతో పాటు పసుపు ధర ఏటేటా పడిపోవడం, ప్రతికూల వాతావరణం, చీడపీడలతో ఆశించిన దిగుబడి తగ్గిపోవడంతో రైతులు క్రమక్రమంగా ఈ ప్రాంతంలో పసుపు సాగు విస్తీర్ణాన్ని పూర్తిగా తగ్గించారు. 70 వేల రూపాయల ఖర్చుతో ఎకరం భూమిలో పసుపు పంట సాగు చేస్తే, 20 నుంచి 25 క్వింటాళ్ల పసుపు దిగుబడి వచ్చినా, క్వింటాలుకు కనీసం 10 వేల రూపాయల ధర లేకుండా 5 నుండి 6 వేల రూపాయలే దక్కడంతో నష్టాల పాలయ్యే పరిస్థితి ఏర్పడింది.
పసుపు సాగు చేసి నష్టాల పాలయ్యే బదులు ఎకరం భూమిలో ఒక సీజన్లో పత్తి పంట వేసి తదుపరి మొక్కజొన్న సాగు చేయడం వల్ల రైతులకు కాస్త ఉపశమనం లభించడంతో పసుపు సాగు పట్ల పూర్తిగా ఆసక్తి తగ్గించారు. ఫలితంగా ఒకప్పుడు పదివేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగయ్యే పసుపు గత ఏడాది మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 369 ఎకరాలకు పడిపోయింది. ఈ క్రమంలో ఈ ఏడాది పసుపు ధర క్వింటాలకు పదివేల నుండి 13 వేల వరకు పలుకుతుండడంతో రైతులు ఓవైపు ఆనందం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు ఆశించిన దిగుబడి రాకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు.
పసుపు సాగు విస్తీర్ణం తగ్గకుండా చూడాలి
సంప్రదాయ పంటగా ఈ ప్రాంతంలో పేరుగాంచిన పసుపు సాగును పూర్తిగా విస్మరించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పసుపు సాగు కు అవసరమైన ఆధునిక పద్ధతులను వివరించాలి. తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి సాధించే విధంగా కృషి చేయాలి. మేలైన విత్తనం రాయితీపై అందించి, కనీసం క్వింటాలుకు పదివేల రూపాయలు ధర లభించే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహక ‘మద్దతు’ అందించాలి.
పడగొట్టొద్దని పసుపు సాగు చేస్తున్నాం
ఏండ్ల కాలం నుంచి పసుపు సాగు చేస్తున్నా. ఎకరాల కొద్ది పంట వేసే వాళ్ళం. పది నెలలు కష్టపడితే కనీసం క్వింటాలుకు 10 వేలు దక్కలేదు. దీనితో పసుపు సాగు విస్తీర్ణం తగ్గించి పత్తి, మొక్కజొన్న పంటలు వేస్తున్నాం. అయితే పూర్తిగా పసుపు పంటను పడగొట్టకుండా 10 గుంటల్లో సాగుచేసిన.
ఇప్పుడు ధర పెరిగినా దిగుబడి ఆశించినంతగా రాకపోవడం వల్ల ధర పెరిగితే ఏం లాభం. కనీసం క్వింటాలుకు పసుపు కు పదివేల రూపాయలు దక్కేటట్లు చూడాలి. పసుపు పంట పడిపోకుండా కాపాడుకోవచ్చు.
బానోత్ హనుమ, రైతు, చిన్ననాగారం పసుపు బోర్డుతో మేలు
నిజామా బాదులో పసుపు బోర్డు ఏర్పాటు వల్ల పసుపు సాగు చేసే రైతులకు మేలు చేస్తుంది. పసుపు సాగులో అవసరమైన ఆధునిక పద్ధతులు, ఇతర సలహాలు సూచనలు అందుతాయి. ఈ ప్రాంతంలో మళ్లీ పసుపు సాగు విస్తీర్ణం పెంచడానికి హార్టికల్చర్ శాఖ ద్వారా అన్ని విధాలుగా కృషి చేస్తాం. భవిష్యత్తులో మళ్లీ పసుపు పంటకు పూర్వవైభవం తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం.
జినుగు మరియన్న, జిల్లా హార్టికల్చర్ అధికారి, మహబూబాబాద్
మానుకోటలో ఏటేటా తగ్గుతున్న పసుపు సాగు విస్తీర్ణం
2016 9,478 ఎకరాలు
2017 14,043
2018 11,180
2019 10,700
2020 8,885
2021 4,476
2022 1,183
2023 261
2024 369 ఎకరాల్లో సాగయ్యింది.