18-09-2025 12:05:43 AM
ముషీరాబాద్ సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ఫీజు బకాయిలు 600 కోట్లు కాదు, మొత్తం గత విద్యా సంవత్సరం వరకు ఉన్న రూ. 8 వేల కోట్లు వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలను దసరా లోపు మొత్తం బకాయిలు ఇవ్వకపోతే దసరా తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు.
ప్రభుత్వం బకాయిల చెల్లింపు కోసం బీసీలు, దళిత, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు పగిళ్ల సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ 25 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకువచ్చిందని, దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేయవద్దని ఆయన హితవు పలికారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న 14 లక్షల మంది విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీల బంధు విరమణ సందర్భంగా ప్రభుత్వం చర్చలు జరిపి 600 కోట్ల బడ్జెట్ విడుదల చేస్తామని ప్రకటించారని, కానీ మొత్తం 8 వేల కోట్ల బకాయిలు ఉంటే 600 కోట్లు ఏ మూలకు సరిపోతాయని ఆయన ప్రశ్నించారు.
స్కాలర్షిప్ల విధానంపై సంస్కరణలు తెస్తామని ప్రభుత్వం చెప్తోందని, సంస్కరణలు ఓకే కానీ, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. సంస్కరణలు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉండాలని ఫీజులని విద్యార్థులకు ఖాతాలో వేస్తామన్నారు, ఇది చూడడానికి మంచిగానే కనిపిస్తుంది కానీ, ఆచరణలో అడ్మిషన్లు సమయంలో ఫీజులు కట్టే వరకు అడ్మిషన్ ఇవ్వమని కాలేజీ యాజమాన్యాలు అంటున్నాయన్నారు.
ఫీజులు కట్టే ఆర్థిక స్తోమత లేని వారు ఎట్లా ఇంజనీరింగ్ అడ్మిషన్లు పొందుతారని ఆయన ప్రశ్నించారు. ఫీజులు కట్టకుండా అడ్మిషన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేదా విద్యార్థులు తల్లిదండ్రులు జాయింట్ అకౌంట్ బదులు, విద్యా ర్థి, ప్రిన్సిపల్ జాయింట్ అకౌంట్ పెట్టాలని ఆయన సూచించారు.
విద్యార్థుల మొత్తం ఫీజు బకాయిలు చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ, విద్యార్థి సం ఘం నాయకులు రాందేవ్ మోడీ, నిఖిల్ పటేల్, రవికుమార్ యాదవ్, లింగ యాద వ్, వెంకట కౌశి తదితరులు పాల్గొన్నారు.
మోదీతోనే బీసీ బిల్లు సాధ్యం
హైదరాబాద్ సిటీ బ్యూరో (విజయక్రాంతి): పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రక నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే సాధ్యమవుతుందని ఆర్ కృష్ణయ్య అన్నారు. ప్రధాని మోదీ జన్మదినం పురస్కరించుకుని బుధవారం బీసీ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ..
దేశంలోని 75 కోట్ల బీసీల ఆకాంక్షలను నెరవేర్చే సత్తా మోడీకి ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చట్టసభలలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం 50% రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా పార్లమెంటులో “బీసీ బిల్లు”ను ప్రవేశపెట్టాలని, ఈ చారిత్రక కార్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే నెరవేర్చగలరని అభిప్రాయపడ్డారు.