11-10-2025 06:12:26 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల పక్షపాతి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలు ఆకాశన్ని అంటుతున్నా ధరలు పెంచకుండా ఆ మొత్తాన్ని కేంద్రమే భరిస్తూ సబ్సిడీ ధరకే యూరియాను అందిస్తున్నారని తెలిపారు. దేశంలోని 1.7 కోట్ల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఏటా రూ.24 వేల కోట్ల నిధులతో ధన్ ధాన్య క్రుషి యోజన పథకాన్ని నేటి నుండి అమలు చేస్తుండటం శుభ పరిణామమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఢిల్లీలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి రూ.42 వేల కోట్ల విలువైన అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. దీంతో పాటు ప్రధానమంత్రి ధన ధాన్య క్రుషి యోజన పథకాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని కరీంనగర్ మిల్క్ డెయిరీ ప్లాంట్ వద్ద వీక్షించారు. అనంతరం కేంద్రం, జపాన్ ఇంటర్నేషనల్ సంస్థ జికా ఆర్ధిక సహకారంతో రూ.90 కోట్ల 70 లక్షలకుపైగా నిధులతో నిర్మించిన ఆటోమెటిక్ కర్డ్ ప్లాంట్ ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో శనివారం రోజున రూ.42 వేల కోట్ల విలువైన అనేక పథకాలను ప్రారంభించుకోవడం గొప్ప విషయమని ప్రధానమంత్రి ధన్ ధాన్య క్రుషి యోజన పథకాన్ని కూడా ఈరోజు ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. దేశంలోని 100 జిల్లాలను ఎంపిక చేసి 1 కోటి 70 లక్షల మంది రైతులను అన్ని విధాలా ఆదుకుని లాభాలు కలిగించేందుకే ఈ స్కీంను అమలు చేయడం ఆనందంగా ఉందన్నారు.
రాజేశ్వరరావు అంటే ఎవరూ గుర్తుపట్టరు, కానీ కరీంనగర్ డెయిరీ రాజేశ్వర్ రావు అంటే అందరికీ సుపరిచితులే నని, కరీంనగర్ డెయిరీని కష్టపడి ఈ స్థాయికి తీసుకురావడంవల్లే ఆయనకు ఆ పేరు వచ్చింది. కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (కరీంనగర్ డెయిరీ) 27 ఏళ్ల చరిత్ర ఉందని పాల వ్యాపారంలోకి వచ్చి కోఆపరేటివ్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికై కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (2012లో) ను ఏర్పాటు చేసి ఈరోజు ప్రతిరోజు 2 లక్షల లీటర్ల పాలను సేకరించడంతోపాటు 40 లక్షల లీటర్ల పెరుగును విక్రయించడం మామూలు విషయం కాదు. 600 మందికి ప్రత్యక్షంగా 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించడంతోపాటు లక్ష మంది పాడి రైతులనుండి పాలను కొనుగోలు చేసి వారి జీవితాలకు భరోసా ఇస్తున్న సంస్థ యాజమాన్యానికి హ్రుదయ పూర్వక అభినందనలు తెలిపారు. కరీంనగర్ డెయిరీ ప్రొడక్ట్స్ ను ఆపేందుకు ప్రభుత్వంలోని కొందరు ప్రయత్నిస్తున్నట్లు నా ద్రుష్టికి వచ్చందని, నేను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కరీంనగర్ డెయిరీ ప్రొడక్ట్స్ ను ఆపొద్దని, మరింతగా విస్తరిస్తూ ప్రజలకు సేవలందించేలా చూడాలని కోరుతునని అన్నారు.