11-10-2025 06:14:32 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ గందరగోళంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్(బిఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు జక్కనపల్లి గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో స్థానిక సంస్థల పరిపాలన వ్యవధి ముగిసి, గ్రామీణ స్థాయిలో అభివృద్ధి కుంటుపడిందని, లోకల్ బాడీస్ లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయని అన్నారు. వ్యవధి ముగిసినప్పటి నుంచి ఇప్పటికి పలుమార్లు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ప్రకటనలు చేసి వాయిదా వేశారని, ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం హైకోర్ట్ స్టే తో ఎన్నికలు నిలిచివేయబడ్డాయన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ ల పెంపు సరైన నిర్ణయమే అయినప్పటికీ ప్రభుత్వం చట్టబద్ధమైన ప్రక్రియ అనుసరించకపోవడం ఎన్నికలు నిలిచిపోయాయాని అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం న్యాయకోవిదులతో చర్చించి, చట్టబద్ధంగా రిజర్వేషన్ లు, అదేవిధంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని డిమాండ్ చేశారు.