calender_icon.png 16 October, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణికొండలో జలధార... ప్రజలకు కన్నీటి ధార!

16-10-2025 07:39:37 PM

* పట్టించుకోని జలమండలి అధికారులు

* లీకవుతున్న పైప్‌లైన్‌తో రోడ్లన్నీ జలమయం

* దోమలతో ప్రజల అనారోగ్యం

* వెలుగని వీధిదీపాలతో చీకట్లో కాలనీలు

మణికొండ (విజ‌య‌క్రాంతి): అధికారుల నిర్లక్ష్యం మణికొండ వాసులకు శాపంగా మారింది. గండిపేట నుంచి మిరాలం ట్యాంకుకు నీటిని సరఫరా చేసే పురాతన కాలువకు మరమ్మతులు చేయకపోవడంతో అది లీకై నీరంతా రోడ్లపై ప్రవహిస్తోంది. ఈ సమస్యపై భారత రాష్ట్ర సమితి స్థానిక నాయకులు గురువారం పైప్‌లైన్ పరిసర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి నిరసన తెలిపారు. సీతారం ధూళిపాళ, గుట్టమీది నరేందర్, ఉపేంద్రనాథ్ రెడ్డి, లక్ష్మణ్ రావు అందే, సంగం శ్రీకాంత్, కిరణ్ యాలాల, ఆరిఫ్ మహమ్మద్, సుమనళిని, బాబు రావు, తిరుపతి తదితరులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. గురుత్వాకర్షణ ద్వారా నీటిని అందించే ఈ చారిత్రక కాలువకు చిన్నపాటి మరమ్మతులు కూడా చేయకపోవడం వలనే లీకులు ఏర్పడి తాగునీరు వృధాగా రోడ్లపాలవుతోందని వారు ఆరోపించారు.

ఈ విషయంపై జలమండలి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు.కాలువకు ఇరువైపులా సుందరీకరణ పనులు చేపట్టకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోయి, ఆ ప్రాంతం దోమలకు నిలయంగా మారింది. దీనివల్ల పసిపిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీకేజీ నీటితో రోడ్లన్నీ బురదమయంగా మారి, పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీనికి తోడు వీధి దీపాలు సరిగ్గా వెలగకపోవడం, ఉన్న కొన్నింటికి చెట్ల కొమ్మలు అడ్డురావడంతో వీధులన్నీ అంధకారంలో మగ్గుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ప్రజా సంక్షేమ చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.