calender_icon.png 18 December, 2025 | 9:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని యూనివర్సిటీలకు నిధులివ్వాలి!

13-12-2025 12:00:00 AM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా ‘ప్రజా పాలన’ ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 10వ తేదిన ఉప్మానియా యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించిన సంగతి తెలిసిదే. ఓయూ అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి సానుకూల స్పందన అభినందనీయం. అయితే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, చాకలి ఐలమ్మ తదితర యూనివర్సిటీల అభివద్ధిపై కూడా సమీక్షించాల్సి ఉంది.

నేడు ఓయూతో పాటు తెలంగాణలోని మిగతా యూనివర్సిటీలు కూడా సమస్యల్లో ఉన్నాయి. ఉస్మానియా వసతి గృహాల్లాగానే, కాకతీయ యూనివర్సిటీ వసతి గృహాలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. అన్ని యూనివర్సిటీల్లో కూడా నూతన వసతి గృహాల నిర్మాణంతో పాటు తరగతి గదుల నిర్మాణం, లైబ్రరీల నిర్మాణం, ప్రయోగశాలలు, ఆడిటోరియంల నిర్మాణం అవసరం.

నేడు రాష్ర్ట ప్రభుత్వం ఓయూకు రూ. వెయ్యి కోట్లు ఇచ్చి మిగతా యూనివర్సిటీలకు ఇవ్వకుంటే అక్కడి విద్యార్థులకు అన్యాయం చేసినట్లే!  తెలంగాణ రాష్ర్ట సాధన కోసం అందరూ ఉద్యమించినవారే. కాబట్టి అన్ని యూనివర్సిటీల అభివృద్ధికి నిధులు కేటాయించాలి.

 కోట ఆనంద్, మహబూబ్‌నగర్