13-12-2025 12:00:00 AM
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలై నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ రెండు దేశాల మధ్య శాంతి పవనాలు మాత్రం ఆమడ దూరంలోనే నిలిచిపోయాయి. ప్రపంచంలో అన్ని యుద్ధాలు తానే ఆపానని సగర్వంగా చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి, యుద్ధ విరమణకు చేసిన ప్రయత్నాలు ఒక్కటి కూడా సఫలం కాలేదు. యుద్ధాన్ని ఆపేందుకు రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ట్రంప్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
మధ్యవర్తిగా తన ప్రతిపాదనలకు ససేమిరా అంటున్న ఉక్రెయిన్ తోపాటు, దానికి అండగా నిలబడిన యూరప్ దేశాలను కూడా ఆయన తప్పుబట్టారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ ఓటమి వైపు నిల్చుందని, యూరప్ దేశాలు బలహీనంగా మారి క్షీణ దశకు చేరుకున్నాయని వ్యాఖ్యానించారు. అంతేకాదు సుదీర్ఘకాలం యుద్ధం ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశముందని పేర్కొన్నారు.
రక్తపాతం ఆగిపోవాలని తాను కోరుకుంటు న్నానని, ఒక్క నెలలోనే యుద్ధం కారణంగా 25 వేల మంది ప్రాణాలు కోల్పోతే అందులో సైనికులే ఎక్కువగా ఉండడం బాధాకరమన్నారు. మరోవైపు యుద్ధం ముగింపునకు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై అసంతృప్తితో ఉన్న జెలెనెస్కీ 20 పాయింట్ల శాంతి ప్రణాళికను రూపొందించి అమెరికా ప్రతినిధులకు పంపించారు. అయితే రష్యాకు డాన్‌బాస్ ప్రాంతాన్ని అప్పగించేందుకు తాము సిద్ధంగా లేమని జెలెనెస్కీ స్పష్టం చేశారు.
యుద్ధం ముగిశాక ఉక్రెయిన్ పునర్నిర్మాణం, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికపై అమెరికాతో చర్చిస్తానని జెలెనెస్కీ వెల్లడించారు. అంతేకాదు యుద్ధం ముగింపు దిశగా ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉన్న 30 దేశాల అగ్ర నాయకులతో జెలెనెస్కీ వీడియో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్‌తో సంధికి ఇష్టపడడం లేదనిపిస్తున్నది. ఆధిపత్య స్థాపనే తమ లక్ష్యమని భారత్ వచ్చేముందే పుతిన్ స్పష్టంగా చెప్పారు.
‘ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైన డాన్‌బాస్ నుంచి వారి దళాలు వైదొలగితే సరే... లేదంటే బలవంతంగా స్వాధీనం చేసుకుంటాం’ అని హెచ్చరించారు. మరోవైపు శాంతి ప్రణాళికలో భాగంగా ట్రంప్ రష్యాకు అనుకూలంగా కొన్ని ఆఫర్లు ఇచ్చినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. ఆ కథనంలో రష్యా నుంచి ఇంధన సరఫరాను యూరోపియన్ దేశాలకు పునరుద్ధరించాలని, రష్యాలోని అరుదైన ఖనిజ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, స్తంభింపజేసిన మాస్కో ఆస్తుల రిలీజ్ చేయడం లాంటి అంశాలున్నాయి.
ఇరు పక్షాలు మధ్య చర్చలు ఫలించాలంటే తొలుత కాల్పుల విరమణ పాటించాలి. రష్యా, ఉక్రెయిన్ రెండూ అందుకు సిద్ధపడటం లేదు. అందుకే చర్చలతో విసిగిపోయిన ట్రంప్ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. శాంతి ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు యూరోపియన్ నేతలతో చర్చకు ట్రంప్ సిద్ధమయ్యారని ఆయన పరిపాలన విభాగం పేర్కొంది.
పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్ బృందం రష్యా, ఉక్రెయిన్‌లతో చర్చలు కొనసాగిస్తుంది. యుద్ధం పేరుతో రష్యా, ఉక్రెయిన్‌లు ఆర్థికంగా చితికిపోయాయి. ఇప్పటికైనా ఇరు దేశాలు రాజీకొచ్చి యుద్ధానికి ముగింపు పలకాలని ప్రపంచ దేశాల నేతలు కోరుకుంటున్నారు.