14-11-2025 01:22:37 AM
బాధితురాలికి న్యాయం చేయాలని వీహె పీ నాయకుల ర్యాలీ
ఎల్బీనగర్, నవంబర్ 13 : తనను ఒకరు వేధింపులకు గురి చేస్తున్నారని...అశ్లీల చిత్రాలు పంపిస్తున్నారని ఆరోపిస్తూ... పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, మళ్లీ వేధిస్తున్నాడని, డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఒక మహిళ చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులపై అనేక అనుమానాలు ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇంతలో మహిళకు న్యాయం చేయాలని వీహె పీ, భజరంగ్ దళ్ నాయకులు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటన సరూర్ నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే... కొత్తపేట డివిజన్ మార్గదర్శి కాలనీలో ఉన్న విజయలక్ష్మి అనెక్స్ అపార్ట్మెంట్ లో యలమంచిలి హిమబిందు(41) ఉంటుంది. అయితే, అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న నాగిరెడ్డి నాగసుబ్బారెడ్డి(37) తనను వేధిస్తున్నాడని, అశ్లీల చిత్రాలు పంపిస్తున్నాడని ఈ నెల 4వ తేదీ సాయంత్రం చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, 5వ తేదీన సుబ్బారెడ్డిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించారు. కాగా, కేసు ఉపసంహరించుకోవాలని, తిరిగి అశ్లీల ఫొటోలు పంపకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని సుబ్బారెడ్డి తనను బెదిరిస్తున్నట్లు 12వ తేదీన హిమబిందు మళ్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
మొదటి ఫిర్యాదు కేసు దర్యాప్తులో భాగంగా అశ్లీల చిత్రాలు పంపిస్తున్నారని ఇచ్చిన ఫోన్ నెంబర్ సుబ్బారెడ్డి పేరుతో ఉండగా... ఆ ఫోన్ నెంబర్ ఫిర్యాదురాలు వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఫిర్యాదు ఆరోపణలపై సాంకేతిక అధారాలను సేకరించాల్సి ఉండడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కొందరు కేసును రాజీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
వీహెపీ నాయకుల ఆందోళన
బాధితురాలు వీహె పీ సభ్యురాలు కావడంతో విషయం తెలుసుకున్న వీహె పీ నాయకులు గురువారం చైతన్యపురిలో ర్యాలీ నిర్వహించారు. హిందూ మహిళల రక్షణ విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని, దీనిపై దర్యాప్తు చేయాలని వీహె పీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ రావినూతల శశిధర్, జిల్లా అధ్యక్షుడు తూము పురుషోత్తం రెడ్డి, జిల్లా కార్యదర్శి పులిమద్ది సుధాకర్, భజరంగ్ దళ్, దుర్గావాహిని, మాతృశక్తి, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు డిమాండ్ చేశారు.