27-09-2025 06:22:43 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్ల కేటాయింపు పై ప్రభుత్వానికి వివరాలు సమర్పించినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వహణ అధికారి గణపతి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావులతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, పంచాయతీ శాఖ అధికారులతో రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా జిల్లాలోని జెడ్పీటీసీ , ఎంపీపీ స్థానాల కొరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ రిజర్వేషన్లకు లాటరీ పద్ధతిన కేటాయింపు జరిగిందని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, సాంఘిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన (ఎస్ఈఈఈపీసీ) ప్రకారం బీసీ రిజర్వేషన్ చేశామన్నారు. జెడ్పీటీసీ కోసం 2 ఎస్టి, 4 ఎస్సి, 7 బిసి, 3 సాధారణ స్థానాలు కేటాయించామని, వీటిలో 7 స్థానాలు మహిళలకు కేటాయించినట్లు తెలిపారు. అలాగే ఎంపీపీ స్థానాల కోసం 2 ఎస్టీ, 4 ఎస్సీ, 7 బీసీ, 3 సాధారణ స్థానాలు కేటాయించామని, వీటిలో 7 స్థానాలు మహిళలకు కేటాయించామన్నారు. ఈ రిజర్వేషన్ స్థానాల కేటాయింపు వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.