25-11-2025 12:30:39 AM
ఎంపీ మల్లు రవి
వెల్దండ, నవంబర్24 అంబేద్కర్ ఆలోచన విధానాలే ప్రపంచానికి మార్గదర్శకాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి అన్నారు. సోమవారం పెళ్ళంట మండల పరిధిలోని గుండాల గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని, బండోన్ పల్లి, పలువు తండా నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో మల్లు రవి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాల్యం నుంచే ప్రతిభావంతుడు అని అతని మేధాశక్తిని గుర్తించి భారత రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా చేశారని మల్లు రవి అన్నారు. నాడు అంబేద్కర్ చేసిన కృషి ఫలితంగానే సమాజంలో మనమంతా స్వేచ్ఛగా సమానంగా జీవించగలుగుతున్నామని అన్నారు. ప్రతి ఒక్కరు చేస్తున్న పనిని ప్రేమతో బాధ్యతగా చేసినప్పుడే ప్రతిభ చూపగలమని ఎంపీ అన్నారు.
జీవితంలో ఏం సాధించాలన్నా ఒక చదువుతోనే సాధ్యమని అందుకే ప్రతి ఒక్కరు ఉన్నత విద్యలు చదువుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్, ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతుందని బడుగు బలహీనవర్గాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గీత. నాయకులు భూపతిరెడ్డి, సంజీవ్ కుమార్ యాదవ్, మోతిలాల్ నాయక్, పర్వత్ రెడ్డి, శంకర్ నాయక్, విజయ్ కుమార్ రెడ్డి, వెంకటయ్య గౌడ్, నారాయణ నాయక్, శీను యాదవ్ తదితరులు పాల్గొన్నారు.