25-11-2025 12:28:54 AM
నాగర్కర్నూల్, నవంబర్ 24 (విజయక్రాంతి): పదో తరగతి విద్యార్థుల విద్యా అభ్యున్నతికి తోడ్పడేందుకు రూపొందించిన క్యూ ఆర్ కోడ్ తో కూడిన డిజిటల్ పాఠ్యసామగ్రిని సోమవారం కలెక్టరేట్లో పంపిణీ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఐఐఎఫ్సిఎల్ ప్రతినిధులతో కలిసి మై విలేజ్ ఎన్జీవో సహకారంతో నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఈ మెటీరియల్ పదవ తరగతి పరీక్షలకు ఎంతో ఉపయోగకరమన్నారు. సిఎస్‌ఆర్ నిధులతో ఐఐఎఫ్సిఎల్ సంస్థ మూడువేల మందికిపైగా విద్యార్థుల కోసం బహుభాషా డిజిటల్ పాఠ్యపుస్తకాలు, క్యూ ఆర్ కోడ్ స్టడీ మెటీరియల్ను అందిస్తోందన్నారు. విద్యార్థులు ఈ మెటీరియల్ను సద్వినియోగం చేసుకొని మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.
విజయంలో సమయపాలన, క్రమశిక్షణ కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతనిస్తూ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు. యన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ లక్ష్యంతో చదివితే విద్యార్థులు ఉన్నత ర్యాంకులు సాధించగలరని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షులు మావిళ్ళ విష్ణువర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్ అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, ఐఐఎఫ్సిఎల్ ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.