25-11-2025 12:30:15 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, నవంబర్ 24(విజయక్రాంతి):ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని, అధికారులు సమన్వయంగా పని చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సర్పంచ్ ఎన్నికలకు సంబందించి, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల విధులు, బాధ్యతలు, నియమ నిబంధనలపై శిక్షణ కార్యక్రమం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డితో కలిసి ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. అధికారులు తమకు ఇచ్చిన హ్యాండ్బుక్ను క్షుణ్ణంగా చదివి ప్రతీ అంశంపై అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి బాధ్యత,రిటర్నింగ్ అధికారిదేనని, బాధ్యతగా విధులు నిర్వహిస్తూ పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పోలింగ్ సిబ్బంది నియామకం, వారికి పోలింగ్ కు సంబంధించిన సామాగ్రి సమకూర్చడం మొదలగు ప్రతి అంశాలను క్షుణ్ణంగా పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. అధికారులు బ్యాలెట్ బాక్స్ ల గురించి, నామినేషన్ ప్రక్రియ గురించి, పోలింగ్ నిర్వహణ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.