calender_icon.png 19 December, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి క్యాంపు ఆఫీస్ లో గుప్పుమన్న అసమ్మతి మంటలు..?

18-12-2025 07:07:11 PM

- ఎమ్మెల్యే తీరుపై పెరిగిన అసమ్మతి 

- పీఏ పై లీడర్ల ఆగ్రహం

- సర్పంచుల సన్మానంలో రగడ 

- వాట్సాప్ గ్రూపులో వైరల్

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తీరుపై మరోసారి అసమ్మతి భగ్గుమన్నది. ఎమ్మెల్యే ప్రధాన అనుచర గణంపై పేరుకుపోయిన అసంతృప్తి ఒక్కసారిగా బద్దలైంది. గురువారం బెల్లంపల్లి క్యాంపు కార్యాలయంలో ఆవరణలో నూతనంగా గెలిచిన కాంగ్రెస్ సర్పంచులకు సన్మానం చేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో ఈ సన్మానం జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. తాండూరు మండలంలో ఎన్నికల సందర్భంలో తలెత్తిన గ్రూపు విబేధాలు సమావేశంలో భగ్గుమన్నాయి. ఆధిపత్య గొడవలు సమావేశాన్ని రసాభస చేశాయి. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగి వేదికపై గందరగోళం నెలకొంది.

సమావేశ వేదికపై రెండు వర్గాలు తోపులాటకు దిగడంతో ఎమ్మెల్యే గడ్డం వినోద్, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ రెడ్డి ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. రెండు వర్గాలను సముదాయించడానికి అక్కడ నాయకులు, కార్యకర్తలు నానా తంటాలు పడ్డారు. అందరి చొరవతో గొడవ సద్దు మనిగిపోయింది. రెండు వర్గాలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ జోక్యం చేసుకొని మందలించారు. గొడవలను సహించని హెచ్చరించారు. అభివృద్ధిలో పోటీపడాలి కానీ ఇలా గొడవలకు దిగితే ఊరుకోనన్నారు. గ్రూపుల ఆధిపత్యానికి సమావేశం వేదికగా మారింది. తాండూరు గ్రూపుల గొడవ సద్దుమణిగి పోయిన నేపథ్యంలో సమావేశం ముగిసిన కొద్ది క్షణంలోనే కొందరు లీడర్లు ఎమ్మెల్యే పీఏ పై తిరుగు బావుటను ఎగరవేశారు. ఈ సంఘటన క్యాంపు కార్యాలయంలో చోటుచేసుకున్నది.

ఆ సమయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్  సర్పంచుల సన్మాన వేదిక బడా ఉన్నారు. భీమిని, కన్నెపల్లి నేన్నెల, వేమనపల్లి మండలాలకు చెందిన సీనియర్ లీడర్లు  కొందరు ఎమ్మెల్యే పీఏ పై తిట్ల దండకంతో విరుచుకుపడ్డారు. క్యాంపు ఆఫీస్ లో బిగ్గరగా అరుపులు, కేకలు వినిపించడంతో బయట ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడినంత పని అయింది. ఏమి జరుగుతున్నదో బయట ఉన్న కార్యకర్తలు క్యాంపు కార్యాలయంలోకి పరిగెత్తుకు వెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే పీఏ పై తీవ్రస్థాయిలో భీమిని, కన్నెపల్లి వేమనపల్లి మండలాల లీడర్లు గొడవకు దిగారు. కాంగ్రెస్లో మొదటి నుంచి కనిపిస్తున్న అసమ్మతికి కారణమైన సీనియర్లకు ప్రాధాన్య లేకపోవడమే ఈ గొడవకు కారణంగా తెలుస్తోంది. ఎమ్మెల్యే పీఏ వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. పీఏ ల కనుసన్నల్లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పనితీరు పై కాంగ్రెస్లో నెలకొన్న అసంతృప్తి మరోసారి గుప్పుమన్నది.

ఎమ్మెల్యే ప్రధాన అనుచరులుగా వ్యవహరిస్తున్న నాయకులే ఇలా గొడవకు దిగడం కలకలం రేపింది. పీఏ పనితీరుపై అసంతృప్తులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ పైకి ముసిరాయి. రోజు రోజుకూ అవికాస్త శృతిమించిపోయాయి. దాని ఫలితమే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ గొడవకు ఆజ్యం అపోశాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీకికంతకూ ఎమ్మెల్యే గడ్డం వినోద్ పార్టీ యంత్రాంగంపై పట్టుకోల్పోవటం, కొందరికే ప్రాధాన్యత ఇవ్వడం వంటి పక్షపాత ధోరణి, ఒంటెత్తు పోకడలు గ్రూపులకు ప్రధాన కారణ మన్నా అభిప్రాయాలు మెజారిటీ శ్రేణుల్లో ఉన్నాయి. "ఆయినా వారికి అకుల్లో కాని వారికి కంచంలో" అన్నతీరున ఎమ్మెల్యే మొదటి నుంచి కాంగ్రెసులో తన మార్క్ గా కొనసాగుతున్నారు. కాంగ్రెసులో సర్వ అసంతృప్తి, అసమ్మతి కి ప్రధాన బాధ్యత ఎమ్మెల్యేనే కనిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో కార్యకర్తలు మధ్య విబేధాలు తలెత్తితే పరిష్కరించాలి కానీ ఎమ్మెల్యే అన్నిటికి కారణం అయితే పార్టీ మనుగడ ఎలా సాగిస్తుందని సీనియర్ నాయకులు, శ్రేణులు వాపోతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మం రథం పట్టారు. ఈ ఘట్టం ముగిసింది.  మునిసిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముందున్నాయి. ఈ నేపధ్యంలో  ప్రజల మూడ్ కాంగ్రెస్ కు పూర్తిగా అనుకూలంగా ఉందని తరువాయి ఎన్నికల కు వెళ్ళే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇలాంటి సందర్భంలో బెల్లంపల్లి లో కాంగ్రెస్లో గ్రూపులు పొడచూపడం భవిష్యత్తు ఎన్నికలపై వాటి ప్రభావం కచ్చితంగా చూపుతుందని రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆశావహులు ఆందోళన పడుతున్నారు. కాంగ్రెస్లో క్రమశిక్షణ పూర్తిగా లోపించిందనీ పార్టీ శ్రేణులు బాధపడిపోతున్నారు. క్రమశిక్షణ తప్పిన నాయకులు, కార్యకర్తలను సరిదిద్దాల్సిన ఎమ్మెల్యేనే ప్రధాన సమస్య కావడం రాష్ట్రంలో ఎక్కడా లేదన్న విమర్శలను వ్యక్తం అవుతున్నాయి. 

బెల్లంపల్లి క్యాంపు కార్యాలయంలో తలెత్తిన అసమ్మతి గొడవ వాట్సాప్ గ్రూపులో వైరల్ అవుతున్నది. స్థానికంగా ఈ అంశంపై చర్చ రచ్చ రచ్చగా సాగుతున్నది. సర్పంచుల సన్మానం కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి మొదటిసారిగా పాల్గొన్న సమావేశంలో బెల్లంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ లో రాజుకున్న గ్రూపులు బయటపడటం ఆయనకూ గొడవలు, అసమ్మతి సెగలు స్వాగతం పలికాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ గొడవలపై  డీసీసీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.