19-12-2025 12:44:02 AM
హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి): ఈఎస్‌ఐ అధికారుల అనాలోచిత నిర్ణయంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లు ఉండేది ఒకచోట అయితే.. వారు రాసిచ్చిన మందులు తీసుకోవాలంటే 20 కి.మీ.లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది ఈఎస్‌ఐ లబ్ధిదారులకు, వారి కుటుంబ సభ్యులతో కలిపిచూస్తే.. సుమారు కోటి మందికి వైద్య సేవలు అందించే వైద్య సంస్థ.
అలాంటి ఈఎస్‌ఐలో అధికారులు ఆలోచించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ ఎర్రగడ్డలో ఈఎస్‌ఐసీ ఆస్పత్రిని ఏర్పాటు చేయగా.. వైద్యులు ఎక్కడ చికిత్స అందిస్తారో అక్కడే ఉండాల్సిన మందుల స్టోర్‌ను నాచారంలో ఏర్పాటు చేశారు. దీనితో రోగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.
రమేష్ (పేరు మార్చాము) .. సిర్పూర్ కాగజ్‌నగర్ ఈఎస్‌ఐ పరిధిలో ఒక కర్మాగారంలో పనిచేసే కార్మికుడు. ఆయన అనారోగ్యానికి గురైతే చూయించుకోవ డానికి దగ్గరలోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీకి వెళ్లాడు. అక్కడ ప్రాథమికంగా పరీక్షించిన వైద్యులు.. సూపర్ స్పెషాలిటీ వైద్యుల వద్దకు వెళ్లాలని హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐసీ అసుపత్రికి రిఫర్ చేశారు. రమేష్ ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐసీ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి సూపర్ స్పెషాలిటీ వైద్యులు కావాల్సిన పరీక్షలు నిర్వహించి.. కిడ్నీ సంబంధమైన వ్యాధితో బాధప డుతున్నాడని గుర్తించారు.
వెంటనే చికిత్స అందించారు. కొద్ది రోజులపాటు మందులు వాడాలని చీటీపై మందుల జాబితా రాశారు. వాస్తవానికి సదరు అత్యవసర మందులు ఈఎస్‌ఐలోనే ఇవ్వాలి. అయితే ఎర్రగడ్డలో మందుల స్టోర్ లేదని, నాచారంలోని మందుల స్టోర్‌కు వెళ్లి తీసుకోవాలని చెప్పడంతో.. ఎర్రగడ్డ నుంచి నాచారం వరకు అంటే సుమారు 15 నుంచి 20 కి.మీ దూరం ప్రయాణిస్తేగానీ మందులు దొరకలేదు.
రోగులకు ‘సూపర్ స్పెషాలిటీ’ వెతలు
ఇది కేవలం ఒక్కరి సమస్య కాదు. ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో చాలా ప్రాణాంతకమైన రోగాలకు సంబంధించి అందించాల్సిన అత్యవసర మందుల కోసం వందలాది మంది రోగు లు నాచారం ఈఎస్‌ఐ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది. అంటే చికిత్స ఒక దగ్గర అందిస్తే.. రోగులు వాడాల్సిన అత్యవసర మందులు మరోచోట.. అదికూడా 15 నుంచి 20 కి.మీ దూ రంలో స్టోర్ ఏర్పాటుచేసి అందిస్తున్నారంటే ఈఎస్‌ఐలో రోగుల పట్ల నెలకొన్న తీవ్ర నిర్లిప్తత మనకు అర్థమవుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే.. ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐసీలోనే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈఎస్‌ఐ లబ్ధిదారులు ఎవరైనా.. సీకే డీ (కిడ్నీ సంబంధించిన), క్యాన్సర్, కార్డియాలజీ లాంటి అతి ముఖ్యమైన వైద్య సేవల కోసం ఎర్రగడ్డలోని ఆసుపత్రికి రావాల్సిందే. రాష్ట్రంలోని ఏదో ఒక మూలన ఉండే ఈఎస్‌ఐ లబ్ధిదారుడు ప్రాణాంతకమైన వ్యాధులబారిన పడి చికిత్స కోసం అష్టకష్టాలు పడి ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐసీ ఆసుపత్రికి చేరుకుని వైద్య సేవలను పొందుతున్నారు.
చికిత్సలో భాగంగా అందించే మందుల కోసం.. నాచారంలోని ఈఎస్‌ఐ అసుసత్రికి వెళ్లడమే తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. అక్కడ వైద్యులు రాసిచ్చిన మందులు లేకుంటే.. మళ్లీ ఎర్రగడ్డలోని వైద్యులను కలిసి తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సి వస్తోంది. ఎర్రగడ్డలోనే మందుల స్టోర్ ఏర్పాటుచేసి, అక్కడే మందులు అందించేలా చర్యలు తీసుకోవాల్సిన కార్మిక శాఖ అధికారులు.. ఎంత అనాలోచితంగా మందుల స్టోర్‌ను నాచారంలో ఏర్పాటు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.