04-01-2026 12:00:00 AM
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొడుకు సుధీర్‌రెడ్డికి పాజిటివ్
హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 3 (విజయక్రాంతి): డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం శనివారం హైదరాబాద్‌లో జరిపిన మెరుపు దాడుల్లో ఏపీకి చెందిన ఓ ప్రముఖ ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.
నానక్‌రాంగూడ ప్రాంతంలో డ్రగ్స్ వినియోగం జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఈగల్ టీం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటుండగా అధికారులు గుర్తించారు. వెంటనే అక్కడికక్కడే నివాసంలోనే వైద్య పరీక్షలు నిర్వహించగా.. సుధీర్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో నార్సింగి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో సుధీర్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
సుధీర్‌రెడ్డి.. మూడోసారి
సుధీర్ రెడ్డి డ్రగ్స్ కేసులో పట్టుబడటం ఇదే తొలిసారి కాదని పోలీసులు తెలిపారు. గతంలోనూ రెండుసార్లు డ్రగ్స్ వినియోగిస్తూ చిక్కారని సమాచారం. కొద్ది రోజులుగా ఆయన కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారని, ఈ ఒత్తిడి కారణంగానే మత్తు పదార్థాలకు బానిసయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. అరెస్ట్ అనంతరం పోలీసులు ఆయన్ను చికిత్స నిమిత్తం డిఅడిక్షన్ సెంటర్‌కు తరలించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈగల్ టీం డ్రగ్స్ కట్టడిపై దూకుడుగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ నగరంలోని అణువణువునా గాలిస్తూ, అనుమానిత ప్రాంతాలపై నిరంతరం నిఘా పెట్టింది. డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. రాజకీయ ప్రముఖుల పిల్లలైనా ఉపేక్షించేది లేదని తాజా ఘటనతో స్పష్టమైంది.