06-01-2026 06:46:14 PM
చిట్యాల,(విజయక్రాంతి): ద్విచక్ర వాహనదారులు తమ ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం. కిరణ్ కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలోని వివిధ పాఠశాలల్లో రోడ్డు భద్రత మాస ఉత్సవాలలో భాగంగా ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలలో అత్యధికంగా తలకు దెబ్బ తాకడం ద్వారానే మరణిస్తున్నారని, హెల్మెట్ పెట్టుకుని ప్రయాణిస్తే మరణాల సంఖ్య తగ్గుతుందన్నారు. కారులో ప్రయాణించేవారు సీటు బెల్టు పెట్టుకుంటే ఎయిర్ బ్యాగుల వల్ల ఉపయోగం అన్నారు. రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాల్ని పాటించాలని సూచించారు. విద్యార్థులంతా తమ కుటుంబ పెద్దలకు రోడ్డు భద్రత గురించి వివరించాలని కిరణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పెద్ది నరేందర్, ఉపాధ్యాయులు నమ్ముల ఆనందకుమార్, ఎన్ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.