calender_icon.png 6 January, 2026 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి ఉద్రిక్తం

04-01-2026 12:00:00 AM

  1. ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో నిరసన
  2. రంగు మారిన సోయాను కొనాలని డిమాండ్ 
  3. బీఆర్‌ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట 
  4. జోగు రామన్న, నేతల అరెస్టు
  5. పోలీస్ స్టేషన్‌లో నేలపై పడుకొని జోగు రామన్న నిరసన 

ఆదిలాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): రంగు మారిన సోయాను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన దశలవారి ఆందోళనలు రోజురోజుకు ఉధృతంగా మారుతున్నాయి. ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆధ్వర్యంలో శనివారం బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. బీఆర్‌ఎస్ ఆందోళన నేపథ్యంలో ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్యాంపు కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు  కార్యాలయానికి వచ్చిన జోగు రామన్న..

కార్యాలయంలోకి చొచ్చుకునేందుకు  ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగి పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో జోగు రామన్నను, బీఆర్‌ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో జోగు రామన్న నేలపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలు పోలీస్ స్టేషన్ గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. 

రైతుల సమస్యలు పరిష్కరించాలి: జోగు రామన్న

ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్సి బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు. రంగు మారిన సోయాను కొనుగోలు చేయడంతో పాటు కపాస్ కిసాన్ యాప్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ శాంతియుతంగా ధర్నా కార్యక్రమాన్ని చేపడితే పోలీసులు అక్రమంగా అరెస్టులకు పాల్పడటం తగదన్నారు. రైతాంగం సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారని విమర్శించారు.