06-01-2026 06:24:58 PM
... పోలీసులకు సమాచారమివ్వండి
... విలువైన వస్తువులు లాకర్లలోనే భద్రపరుచుకోండి
... జిల్లా ప్రజలకు ఎస్పీ నితిక పంత్ విజ్ఞప్తి
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే జిల్లా వాసులకు జిల్లా ఎస్పి నితిక పంత్ కీలక సూచనలు చేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజుల పాటు బయటికి వెళ్లే వారు, వెళ్లే ముందు తప్పనిసరిగా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు లేదా బీట్ పోలీస్ అధికారికి సమాచారం అందించాలని కోరారు.పండుగ సమయంలో చాలా మంది కుటుంబ సమేతంగా ఊర్లకు వెళ్తారని, ఇదే అవకాశంగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే ప్రమాదం ఉందని తెలిపారు. ముందుగానే పోలీసులకు సమాచారం ఇస్తే, పెట్రోలింగ్‌లో భాగంగా సిబ్బంది ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతారని వివరించారు.
ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు నగదు, బంగారం తదితర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకూడదని ఎస్పీ ప్రజలకు సూచించారు. వాటిని బ్యాంకు లాకర్లలో లేదా ఇతర సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవడం ఉత్తమమని చెప్పారు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే చోరీలను నివారించి పండుగను ప్రశాంతంగా జరుపుకోవచ్చని పేర్కొన్నారు. నేరాలను ముందుగానే నివారించడంలో ప్రజల సహకారం పోలీసులకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. పండుగ సీజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు.