06-01-2026 05:57:54 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్‌సీడీ స్క్రీనింగ్, ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, క్షేత్ర స్థాయిలో ప్రజలకు అన్ని వ్యాధులపై అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
ఆరోగ్య కేంద్రంలో ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఇమ్యూనైజేషన్ గది, ఇన్‌పేషెంట్ గదులు తదితర విభాగాలను పరిశీలించారు. ఏఎన్‌ఎంలతో మాట్లాడి గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎన్‌సీడీ స్క్రీనింగ్ ద్వారా వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి అవసరమైన చికిత్స అందించవచ్చని తెలిపారు. రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని, వైద్యులు–సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అలాగే సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆసుపత్రి ఆవరణం శుభ్రంగా ఉంచాలని వైద్యాధికారికి సూచించారు.