calender_icon.png 29 September, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాల్వంచలో ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు నిర్మించాలి

29-09-2025 12:24:59 AM

చిట్యాల శ్వేత డిమాండ్ 

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 28, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ పట్టణంలో 800 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ మహిళా పోరాటాల యోధురాలు చాకలి ఐలమ్మ ముని మనమరాలు చిట్యాల శ్వేత డిమాండ్ చేశారు. ఆదివారం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం అధిక కాలుష్యాన్ని వెదజల్లు తుందని 720 మెగావాట్ల సామర్థ్యం గల 8 యూనిట్ల విద్యుత్ ప్లాంట్ ను నేలమట్టం చేశారన్నారు.

ఆ విద్యుత్ ప్లాంట్ స్థానంలో కొత్తగా మరో విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆమె ఆరోపించారు. విద్యుత్ ప్లాంటును ఆధారంగా వేల కుటుంబాలు జీవిస్తున్నాయని, పవర్ ప్లాంట్ కూల్చడం వల్ల కార్మికులు చల్లా చెదరయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వనరులున్న విద్యుత్ కర్మాగారం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఆమె తప్పు పట్టారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకల వనరులు కలిగిన పాల్వంచ పట్టణంలో మరో 800 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పాల్వంచ పట్టణంలో తెలంగాణ వీర వనిత , భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జాతీయ మాల మహానాడు అధ్యక్షులు జి చెన్నయ్య, జిల్లా అధ్యక్షులు కే నూతన్, కాంపాటి దుర్గాప్రసాద్, బూర్గుల వెంకటేశ్వర రావు (బాచి), మహేష్, చెరుకు అశోక్, మధు రెడ్డి రాజుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు