11-08-2025 12:00:00 AM
భారతీయ సినిమా మాటలు నేర్వ క ముందు.. మూకీ యుగంలోనే తెలంగాణ గడ్డమీద పుట్టిన పైడి జైరాజ్ ముంబై చేరుకుని స్టార్‌గా ఎదిగి తన కీర్తి బావుటాను ఎగురవేశాడు. అటు మూకీ సినిమాల్లోనూ, తర్వాత వచ్చిన టాకీ సిని మా ప్రపంచంలోనూ తనదైన విలక్షణతను చాటుతూ భారతీయ సినీ యవనికపై వెలుగొందినాడు.
ఆరడుగుల ఆజానుబాహుడైన జైరాజ్ ఆనాటికి అత్యంత వెనుకబడిన కరీంనగర్‌లో పుట్టి, హైదరాబాద్ నగరంలో చదువుకుని, నటనపైన, సినిమా రంగం పైన వున్న మక్కువతో ముంబై చేరుకుని, అంచెలంచెలుగా ఎదిగి భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయాడు. సినిమా వికాసానికి తన జీవిత కాలంలో చేసిన సేవలకుగాను 1980లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుని తెలంగాణా కీర్తిని నలు దిశలా వ్యాపింపజేశాడు.
1909 సెప్టెంబర్ 28న కరీంనగర్‌లో జన్మించిన పైడి జైరాజ్ -ఇండియన్ నైటింగేల్ సరోజి ని నాయుడు భర్త ఎం.గోవిందరాజులు నాయుడికి మేనల్లుడు. బాల్యంలోనే జైరాజ్ కుటుంబం కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లి స్థిరపడింది. జైరాజ్‌కు చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఇష్టం. 1913లోనే దాదాసాహెబ్ ఫాల్కే హిందీ సినిమాకు పురుడు పోశాక రంగుల కళ దేశమంతా విస్తరించింది.
అందుకే కావచ్చు నిజాం కాలేజ్‌లో చదువుతున్నపుడే సినిమాల్లో హీరోగా చేయాలన్న కోరిక జైరాజ్‌కు కలిగింది. అందుకే అన్న సుందరరాజ్ తన తమ్ముడు ఇంజనీరై హైదరాబాద్‌లో పనిచేయాలన్న అభీష్టానికి భిన్నంగా సినిమా నటుడు కావాలని నిర్ణయించుకున్నాడు. ఏదో సం దర్భంలో సరోజిని నాయుడు జైరాజ్‌ను తన అల్లుడుగా కాకుండా, స్వయం కృషితో నీ ప్రతిభ ఏమిటో నీ కాళ్లపై నిలబడి నిరూపించుకోవాలని ఉపదేశించడంతో జైరాజ్ పట్టుదలతో సినీరంగంలో తన ప్రతిభను పరీక్షించుకోవాలని.. 1928లో ముంబాయి రైలు ఎక్కాడు.
ఆ రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమ ఇంకా కళ్లు తెరవలేదు. హిందీ సినిమాల్లో మూకీ ట్రెండ్ నడుస్తుంది. అలాంటి టైమ్‌లోనే అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముంబాయి వెళ్లాడు జైరాజ్. తెలుగువాళ్లంతా మద్రాస్ వెళ్లి వేషాలు వెతుక్కుంటుంటే తెలంగాణాకు చెందిన జైరాజ్ మాత్రం పది అడుగు లు ముందుకు వేసి ముంబాయిలో తొలితరం బాలీవుడ్ నటుడుగా పునాది వేశాడు.
అవకాశాల కోసం ముంబై పయనం..
పైడి జైరాజ్ ముంబైలో అడుగుపెట్టే సమయానికి అనే క హిందీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అప్పటికే బాలీవుడ్‌లో చాలా కాంపిటీషన్ ఉంది. సంపన్న కుటుంబాలకు చెందిన వారికి మాత్రమే సినిమా అవకాశం దక్కేది. ఆరడుగుల ఎత్తు ఆకట్టుకునే శరీర సౌష్టవం, ఇతర నటులను తలదన్నే రూపంతో జైరాజ్ పదిమందిలో ప్రత్యేకంగా కనిపించేవాడు.
అయినా అవకాశాల కోసం జైరాజ్ ఎదురు చూశాడు. అదే సమయంలో ముంబాయిలో మహావీర్ ఫిలిం కంపెనీలో పని చేసే తన చిన్ననాటి స్నేహితుడు మావరేర్కర్ అనే నిర్మాత దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేశాడు. జైరాజ్ తెలంగాణాలో పుట్టడం, హైదరాబాద్‌లో చదువుకోవడం కారణంగా ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, భాషల్లో అనర్గళంగా మాట్లాడటంతో పాటు, ఆయన అందానికి శరీ ర సౌష్ఠవానికి ముచ్చటపడి మావరేర్కర్ తన సినిమాలో అవకాశం ఇవ్వడమేకాక, ఆయనే స్వయంగా జైరాజ్‌కు మేకప్ చేయడం ఆయన సినీ జీవితంలో అనుకోని మలు పు.
అయితే ఆ సినిమా పూర్తి కాకపోయినప్పటికీ అదే సిని మా దర్శకుడు నాగేంద్ర మజుందార్ తన సొంత చిత్రం ‘జగమ్ గాతి జవాని’ అనే మూకీ చిత్రంలో జయరాజ్‌కు సహాయ నటుడిగా అవకాశం ఇచ్చాడు. ఆ చిత్రంలోని కథానాయకుడు మాదవ్ ఖేల్‌కు గుర్రం స్వారీ, యుద్ధం చేయ డం రాకపోవడంతో ఆయా సన్నివేషాల్లో ముసుగు వేసుకుని జైరాజ్‌ను నటింపచేసారు. ఆ తర్వాత నాగేంద్ర మజుందార్ నవజీవన ఫిల్మ్ వారి ‘రస్సేరి రాణి’ చిత్రంలో జైరాజ్‌ను హీరోగా పరిచయం చేశారు. ‘
ది ప్రిజెన్ ఆఫ్ జెండా’ అనే ఇంగ్లీష్ నవల ఆధారంగా తీసిన ఈ చిత్రంలో జైరాజ్ ప్రక్కన ఫేమస్ హీరోయిన్ మాధురి నటించింది. ఈ చిత్రం అప్పటి మూకీ చిత్రాలలో ఐదు వారాలు నడిచి సంచలనం సృష్టించింది. దీంతో నవజీవన్ ఫిల్మ్‌కి జయ్‌రాజ్ మరో నాలుగు సినిమాలు చేశారు. తర్వాత శారద ఫిల్మ్ కంపెనీ ద్వారా జహీరున్నీసా హీరోయిన్‌గా ‘మహాసాగర్ నో మోతి’ అనే పెద్ద చిత్రంలో హీరోగా చేశాడు.
అది గొప్ప సక్సెస్ కావడంతో మూకీ చిత్రాల్లో గొప్ప నటులైన దిల్లీ మోరియా, శాంతారాం, జాన్ మార్చంట్, పృథ్వీరాజ్ కపూర్ సరసన జైరాజ్ చేరారు. అప్పుడు శారద ఫిల్మ్‌కి మరో ఐదు చిత్రాలు చేశారు. అలాగే 1930లో ‘స్పార్కింగ్ యూత్’ అనే మూకీ చిత్రంతోపాటు ‘ట్రయాంగిల్ ఆఫ్ లవ్’, ‘మాతృభూమి’, ‘ఫైట్ ఇన్ టూ డెత్’ చిత్రంలో కథానాయకుడిగా నటించారు. 1931లో మొట్టమొదటి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’ వచ్చినప్పటికీ స్వయంగా పాడుకోలేకపోవడం వల్ల వెంటనే జైరాజ్‌కు ఛాన్స్ రాలేదు. తర్వాత అదే ఏడాది హిందీ, ఇంగ్లిష్, ద్విభాషా చిత్రం ‘షికారి’లో బౌద్ధ సన్యాసి పాత్ర పోషించారు.
పౌరాణిక చిత్రాల్లోనూ..
జైరాజ్ మొదటి పౌరాణిక చిత్రం ‘అహల్య ఉద్దార్’ హీరోగా వెలిగిపోయాడు. ఈ చిత్రంతో యాక్షన్ ఎడ్వంచర్ చిత్రాల్లో ఆయనకు అనేక సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఆయన మొట్టమొదటి సాంఘిక విప్లవాత్మక సినిమా మున్షీ ప్రేమ్‌చంద్ ప్రేమకథపై ‘మిల్‌మజ్దూర్’, 1936లో ఇండియన్ ఫిల్మ్ కార్పొరేషన్ కరాచిలో చేసిన ‘బేరోజ్‌గార్’ సినిమాలో లీలా చిట్నీస్ పక్కన హీరోగా చేశాడు. కరాచీలో ’గ్యాంగ్‌లో’ అనే మరో చిత్రాన్ని చేశాడు.
అనంత రం ముంబాయి తిరిగి వచ్చిన తరువాత ననూభాయ్ దేశాయ్ మునియోటోన్‌కి మూడు సినిమాలు, జియాసర్వది దర్శకత్వంలో ‘అఫ్సానా’, సాకేశ్‌కీ దర్శకత్వంలో ‘మురాద్’ చిత్రాలు చేశాడు. ‘రైఫిల్ గర్ల్’ అనే చిత్రం ద్వారా హీరో యూసుఫ్ ఆఫంది కంటే జైరాజ్‌కు గొప్ప పేరు వచ్చింది.. అప్పటికే జయరాజ్ పేరుమీద సినిమాలు నడిచే స్థాయికి చేరుకున్నాయి. ఫ్రాంజ్ ఆస్టిమ్ దర్శకత్వంలో జయ్‌రాజ్ హీరోగా 1936లో రూపొందించిన ‘బాబీ’ అనే చిత్రం ముంబైలో స్వర్ణోత్సవం జరుపుకోవడం, కలకత్తాలో 80 వారాల పాటు నడిచి చరిత్రను సృష్టించింది.
ఇంకా ‘పురంజన్‌దేవతన్’, ‘బిజిలి’, ‘మాల’ చిత్రాలు జయరాజ్‌ని సూపర్‌స్టార్ చేయడంతో ఆయన క్రమక్రమంగా ప్రఖ్యాత హీరోగా ఎదిగి భారతీయ చలనచిత్ర రంగంలో అభిమానుల ప్రశంసలు సంపాదించుకున్నాడు. 1939లో జైరాజ్ పంజాబీ వనిత సావిత్రిని పెళ్లాడడం, అంతవరకు నెలకి రూ. 300 ఉన్న జీతం కూడా రూ. 600 కు పెరగడం జరిగింది. 1942లో దిలీప్‌రాజ్, తర్వాత జయతిలక్, కూతుళ్లు జయశ్రీ, దీప, గీత జన్మించారు. పెళ్లి తర్వాత బి.ఎమ్.
వ్యాస్ చిత్రం ‘ప్రఖ్యాత’, కె.ఎ. అబ్బాస్ సినిమా ‘నయా దునియా’, ప్రకాశ్ ఫిల్మ్ వారి ‘నయా కహాని’, నవయుగ వారి ‘నయీ తరాన’, ‘పన్నా’ చిత్రాలు, సజరసఖ్వీ దర్శకత్వంలో చేయటం ఆయన సినీ జీవితంలో మరికొన్ని మలుపులు, నవయుగ వారి సాదన్ కా ఘర్ చిత్రం చేస్తున్నప్పుడే జైరాజ్ పూనాలో స్థిరపడ్డారు. తర్వాత శాలిమార్ వారి ‘ప్రేమ్ సంగీత్’ బాంబే టాకీస్ వారి -‘అమియా’, 1943లో బాలీవుడ్ ఫేమస్ నిర్మాణ సంస్థ పిక్చర్ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందించిన ‘హమారీ బాత్’ చిత్రంలో టాప్ హీరోయిన్ దేవికారాణి సరసన చేయటం జరిగింది. ఈ చిత్రం మ్యూజికల్‌గా సూపర్ హిట్ అవటంతో బాలీవుడ్‌లో జైరాజ్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. ఇది దేవికారాణి చివరి చిత్రం.
వందలాది చిత్రాలు..
జైరాజ్ అనేక చిత్రాల్లో ఎన్నో రకాల పాత్రలు పోషించినప్పటికి జాతీయ నాయకుల పాత్రలు దేశానికి -గుర్తుండే వి. ప్రేరణ కలిగించేవి. ఒక నటుడిగా ఈ పాత్రలే ఎక్కువగా సంతృప్తినిచ్చినట్లు ఆయన చెప్పేవాడు. జైరాజ్ చిత్ర జీవితంలో 1946 నుంచి చారిత్రాత్మక సినిమాల్లో పనిచేసిన ఎనిమిది ఏళ్లు ప్రాధాన్యమైనవి. 1946లో మహారాణా ప్రతాప్ సోదరుడైన శక్తిసింగ్‌గా నటించిన ‘రాజ్‌పుటాని’ మొదటి చారిత్రాత్మక సినిమా.
జైరాజ్ చేసిన ఒకే ఒక ఫాంట సీ చిత్రం ‘హతీంతాయి’ ఒక గొప్ప సినిమా, అందులో షకీలాపై చేసిన ‘సర్వర్‌దిగార్ ఆలమ్’ అనే పాట ఎంత పాపులర్ అంటే హైదరాబాద్ నిజామ్ పాటని 10 సార్లు రివైండ్ చేయించుకొని చూసారట. జైరాజ్ మొట్టమొదటి మల్టీస్టారర్ చిత్రం కె.ఎ.అబ్బాస్ నిర్మించిన ‘చార్ దిల్ చార్ రహే’లో రాజ్‌కపూర్, మీనాకుమారి, షమ్మీ కపూర్‌తో కలిసి నటించాడు. జైరాజ్ హీరోగా మీనా కుమారి బాలనటిగా నటించిన ఈ సినిమాలోని ఫొటోలు చూస్తూ జైరాజ్ ఎప్పుడూ ఆనాటి అనుభూతులు జ్ఞాపకం చేసుకునేవాడు.
ఆయన సినీ జీవితంలో నటించిన ‘శకారి’, ‘ముజ్దార్’, ‘తీరందాజ్’, ‘పిక్‌పాకెట్’, ‘బాబీ’, ‘ముంతాజ్ మహల్’, ‘రజీ యా సుల్తానా’, ’సాజన్‌కా ఘర్’, ‘ప్రేమ్ కహానీ’, ‘హమారీ బాత్’, ‘ప్రేమ్ సంగీత్’, ‘షన్నా’, ‘రిటర్న్ ఆప్ మిష్టర్ సూపర్‌మాన్’, ‘పరివార్’, ‘మధుర్ మిలన్’, ‘పతీత పావన్’, ‘ఔరత్ కా దిల్’, ‘అంజుమాన్’ లాంటి అనేక చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. జైరాజ్ హీరోగా చేసిన చివరి చిత్రం 1965లో వచ్చిన ‘కుహీకౌన్ ముజ్జికౌన్’, తర్వాత జైరాజ్ కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు.
జైరాజ్ తన 70 వసంతాల సినీ ప్రయాణంలో 11 మూకీ సినిమాల్లో నటించి తన సత్తా నిరూపించుకొని, 156కు పైగా టాకీ సినిమాల్లో హీరోగా మొత్తం దాదాపుగా 300 సినిమాల్లో పైగా నటించాడు. 1931లో ప్రారంభమైన టాకీ యుగంలో ఆయన ‘షికారి’ ఉర్దూ చిత్రంలో హీరోగా టాకీల్లో ప్రవేశించి తర్వాత కాలంలో శాంతారాం, పృథ్వీరాజ్ కపూర్, షమ్మీకపూర్ లాంటి హీరోల సరసన మరో పెద్ద హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నిరుపారాయ్, శశికళ, దేవికారాణి, మీనాకుమారి, మాధురి, షకీలా, శోభనా లాంటి హీరోయిన్ల సరసన కథానాయకుడిగా నటించి అనేక విజయాలను సొంతం చేసుకున్నాడు.
ఎంతోమందికి లిఫ్ట్..
జైరాజ్ తెరమీదనే కాకుండా తెర వెనుక కూడా కీలక పాత్ర పోషించారు. కెమెరా, సెట్, ల్యాబ్ ఎడిటింగ్ నేర్చుకున్నారు. హీరోగా బిజీగా ఉన్న సమయంలోనే దర్శకుడు గా మారాడు. 1945లో దిలీప్ కుమార్ రెండవ సినిమా ప్రతిమను జైరాజ్ డైరెక్ట్ చేశాడు. 1959లో ‘రాజ్‌ఘడ్’, ‘మొహర్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండు సినిమాల్లోనూ తన శిష్యుడు షమ్మీకపూర్‌కు హీరోగా అవకాశమిచ్చారు.
అప్పటి టాప్ హీరో లు రాజ్‌కపూర్, షమ్మీకపూర్ జైరాజ్‌ను ‘పాపాజీ’ అని పిలిచేవారు. 1951లో ప్రసిద్ధ ఆంగ్లకవి టెన్నిసన్ రాసిన ఓ కవిత ఆధారంగా నర్గీస్, భరత్‌భూషణ్‌తో ‘సాగర్’ చిత్రాన్ని స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించాడు. కానీ, ఈ చిత్రం ప్లాప్ కావడంతో మళ్లీ సినిమాలు తీయలేదు. ప్రముఖ సంగీత దర్శకుడు నౌషాదును వెండితెరకు పరిచయం చేసింది కూడా జైరాజ్‌నే. విలక్షణమైన నటుడిగా వైవిధ్యమైన పాత్రలు పోషించిన జైరాజ్ హిందీ, ఉర్దూ భాషలతో పాటు కొన్ని మరాఠీ, గుజరాతీ భాషా చిత్రాలలో కూడా నటించారు.
మరాఠీ, గుజరాతీ సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు జైరాజ్‌ను ఘనంగా సత్కరించాయి. 1939 నుంచి సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉంటూ కళాకారుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశాడు. హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ భాషా చిత్రాలలో నటించిన జైరాజ్ తెలుగువాడై ఉండి కూడా ఒక్క తెలుగు చిత్రంలో కూడా నటించలేకపోయానన్న బాధని ఆయన సన్నిహితుల వద్ద ప్రస్తావించేవాడట.
తెలుగులో చిత్తూరు నాగయ్యతో కలిసి ఒక చిత్రం నిర్మించటానికి సన్నాహాలు చేసుకున్నా, నాగయ్య మరణించడంతో ఆ ప్రయత్నం నిలిచిపోయింది. ౨౦౦౦ ఆగస్టు 11న ముంబైలో జైరాజ్ తుది శ్వాస విడిచాడు. భారతీ చలన చిత్ర సీమలో తనదైన శైలి, నటనా చాతుర్యంతో ఆకట్టుకున్న ఆయన స్ఫూర్తి తరగని గని.
పొన్నం రవిచంద్ర (రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)