calender_icon.png 12 August, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంపొందించాలి

12-08-2025 02:49:56 PM

- జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్,

 నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల(Government hospitals) పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. మంగళవారం తెల్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషంట్, ఫిమేల్, వార్డులు, ల్యాబ్ తదితర విభాగాల పనితీరు పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. ప్రతి రోజు ఎంత మంది పేషంట్లు వస్తున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. హెల్త్ సెంటర్ ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీస్తూ, రికార్డులను తనిఖీ చేశారు.

ఇమ్యునైజేషన్, ఏ.ఎన్.సీ చెకప్ లు, టీ.బీ ముక్త్ భారత్ అభియాన్, ఆరోగ్య శిబిరాల నిర్వహణ తదితర సేవలను ప్రజలు సదివినియోగం చేసుకునేలా చూడాలని హితవు పలికారు. హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో చేపట్టే ఆరోగ్య శిబిరాలు, ఇతర వైద్య సేవా కార్యక్రమాల గురించి ముందస్తుగానే ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు వంటివి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ ఎవరికైనా సీజనల్ వ్యాధులు సోకితే తగిన చికిత్సలు అందిస్తూ, ఇతరులకు సోకకుండా పరిసర ప్రాంతాలను ఫాగింగ్ జరిపించాలని అన్నారు. రౌండ్ ది క్లాక్ ఆసుపత్రులలో అన్ని సమయాలలో వైద్యులు, సిబ్బంది విధుల్లో ఉండాలని ఆదేశించారు.  జిల్లా కలెక్టర్ వెంట మండల తహసిల్దార్ జాకీర్ అలీ, మండల వైద్యాధికారి డాక్టర్ అనిత తదితరులు ఉన్నారు.