11-08-2025 12:00:00 AM
అమ్మ చనుబాల మధురామృతము గ్రోలుటకై,
ఆటుపోటులు లేని ఆటపాటలఊటలకై
నాయనమ్మ కొంగులో నలిగిన రూపాయి నోటుకై
ఆలయ శిఖరాన జేగంట మేలుకొలుపు పిలుపుకై
గురువుల భడవా అన్న పిలుపుకై
గురితప్పని గోగుపుల్లల బాణానికై
వెలుగు పంచిన బుడ్డి దీపానికై
ఆలమందల గోధూళి వర్ణానికై
కలికి చిలుక జోస్యానికై
చిలిపి చెలికాని హాస్యానికై
పిల్ల తెమ్మెరల తమ్ములకై
కొబ్బరాకుల బొమ్మలపెళ్ళికై
ఎనలేని ఎన్టీవోడినటనకై
అద్భుతాలచందమామ కథలకై
వేలికి మొలిచిన గొట్టాల రుచికై
పచ్చికలోని పిచ్చి బంతి ఆటకై
బ్రతుకు పరుగు నేర్పిన పరుగుపందెముకై
అటక ఎక్కే కిటుకు తెలిసిన రోజుకై
గాలివాటపు గాలిపటాల హొయలకై
ఎలమావికోయిల మధుర గానానికై
వానచినుకు ముద్దాడిన మట్టి వాసనకై
చెమట కక్కిన నాన్న చొక్కా వాసనకై
అమ్మమ్మ మిరప బజ్జీల ఘాటుకై
గాయాల గేయాలకు దూరంగా నిష్కల్మషమైన నా బాల్యానికై,
నే పోతున్నా&