18-08-2025 12:12:05 AM
రూ.64 లక్షల విలువైన 128 కిలోల ఎండు గంజాయి స్వాధీనం
నలుగురు అంతర్రాష్ర్ట అక్రమ రవాణాదారులు అరెస్ట్
పటాన్‌చెరు, ఆగస్టు 17 : పటాన్‌చెరు మండలం పాటి క్రాస్ రోడ్డు వద్ద నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా సుమారు రూ.64 లక్షల విలువైన 128 కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు ఆదివారం బిడిఎల్-భానూర్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, సంగారెడ్డి జిల్లా ఎస్-న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావ్ సిబ్బందితో కలిసి పాటి క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా హైదరాబాద్ వైపు నుండి సంగారెడ్డి జిల్లా ముత్తంగి వైపు సర్వీస్ రోడ్డుపై వస్తున్నస్విఫ్ట్ డిజైర్ కారు, సిల్వర్ రంగుగల మహీంద్రా బొల్లేరో కారు ఆపి తనిఖీ నిర్వహించగా 55-ప్యాకెట్ల ఎండు గంజాయిని గుర్తించడం జరిగిందన్నారు.
దాని విలువ సుమారు 64 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. నిందితులు ఒడిశా రాష్ర్టంలోని గజపతి జిల్లాలోని సరఫరాదారు రాజ్ కుమార్ వద్ద నుంచి గంజాయి తెచ్చి, మహారాష్ర్టలోని నాసిక్ జిల్లా, మలేగావ్ ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలినట్లు చెప్పారు. గంజాయి సరఫరా చేస్తున్న ఫిరోజ్ అహ్మద్ కలీమ్ అహ్మద్, సగర్ నాయక్, మెహబూబ్ అబ్దుల్ అహద్, మహ్మద్ ఇర్ఫాన్ మహ్మద్ అక్ఱమ్ ను అదుపులోకి తీసుకొని వారినుండి ఐదు సెల్ ఫోన్లు, రెండు కార్లను సీజ్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఆత్మహత్యను అడ్డుకున్న క్యూ ఆర్టీ పోలీసులు
మెదక్, ఆగస్టు 17 : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతుండగా మెదక్ జిల్లా క్యూ ఆర్టీ పోలీసు సిబ్బంది కాపాడిన సంఘటన వివరాలు ఇలావున్నాయి. పాపన్నపేట మండలం ఏడుపాయల వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండగా రెండవ బ్రిడ్జి వద్ద కురువగడ్డ వద్ద కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామానికి చెందిన మంగలి వెంకటేశం అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా బందోబస్తులో ఉన్న క్యాఆర్టీ సిబ్బంది గమనించి అతని అడ్డుకొని ప్రాణాలు కాపాడారు. అతని వివరాలు సేకరించి కుటుంబీకులకు అప్పగించారు. క్యూఆర్టీ సిబ్బందిలో సాయిలు, అశోక్, భాను ప్రసాద్, పరమేశ్వర్, వికాస్, భాస్కర్, మనోజ్, ప్రశాంత్, సురేష్, నవీన్ ఉన్నారు.