calender_icon.png 18 August, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్ము కశ్మీర్‌లో మరో క్లౌడ్ బరస్ట్

18-08-2025 01:23:47 AM

  1. కథువా జిల్లాలో ఏడుగురు మృతి
  2. అనేకమందికి గాయాలు
  3. నీటమునిగిన కథువా పోలీస్‌స్టేషన్
  4. మరణాలపై సీఎం ఒమర్ విచారం

జమ్ము, ఆగస్టు17(విజయక్రాంతి): జమ్ము కశ్మీర్‌లో ఆదివారం మరోసారి క్లౌడ్ బరస్ట్ జరిగింది. కథువా జిల్లాలోని ఘాటి గ్రామంలో ఈ విపత్తు సంభవించింది. దీం తో భారీగా వచ్చిన ఆకస్మిక వరదల్లో ఏడుగురు చనిపోయారు. మరికొందరు గాయప డ్డారు. ఘాటీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఒక్కసారిగా ఆకస్మిక వరదలు రావడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

కొందరు గాయపడ్డారు. వరదల ధాటికి రైల్వే ట్రాక్‌లు, జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. క్లౌడ్ బరస్ట్ వల్ల ఘాటి గ్రామానికి రాకపోయలు ఆగిపోయాయి.వరదల ఉధృతికి ఇళ్లు నేటమట్టం అయ్యాయి. భారీ వరదలకు కథువా పోలీస్‌స్టేషన్ నీట మునిగింది. ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు, స్థానిక యంత్రాంగం, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

ఘాటి సమీపంలోని జుతానా జోడ్ అనే ప్రదేశంలో కొండచరియలు విరిగిపడడంతో అక్కడ శిథిలాలకింద ఒక కుటుంబం చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. క్లౌడ్ బరస్ట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మరోవైపు కథువా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బగార్డ్, చాంగ్డా గ్రామాలు, లఖన్‌పూర్ పీఎస్ పరిధిలోని దిల్వాన్ కొండచరియలు విరిగిపడ్డాయి.

అయితే ప్రాణనష్టం జరగలేదు. భారీ వర్షాల కారణంగా ఉజ్, సహాక్ నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కుండపోత వర్షంపై సమాచారం అందగానే కథువా పోలీస్ అధికారి శోభిత్ సక్సేనాతో మాట్లాడినట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్  తెలిపారు. మృతులకు ఆయన సంతాపం ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థతిపై ఆరా తీశారు.

సహాయక సిబ్బంది ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని బాధితులను అండగా ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు కథువా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని జిల్లా అధికారులు హెచ్చరించారు.

కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాగా ఇటీవల కిష్త్‌వాడ్ జిల్లాలోని చషోటి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ జరిగి ఆకస్మిక వరదలు రావడంతో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. పలు ఇళ్లు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.