calender_icon.png 18 August, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీఏ @ అక్రమాలు..

18-08-2025 12:20:21 AM

  1. కాసులిస్తేనే కదలిక.. 

ప్రతీ ఫైల్‌కు ఓ రేటు..

లేకుంటే కొర్రీలతో ఫైల్ పెండింగ్..

ఆర్టీఏలో బ్రోకర్ల రాజ్యం.. 

వారు చెప్పిందే వేదం

నిత్యం రూ.లక్షలు చేతులు మారుతున్న వైనం

నల్లగొండ, ఆగస్టు 17(విజయక్రాంతి) : నల్లగొండ ఆర్టీఓ(రవాణశాఖ) కార్యాలయం అక్రమాల పుట్టగా మారిపోయింది. ఆర్టీఓ కార్యాలయంలో అడుగు పెట్టింది మొదలు.. పని కంప్లీట్ అయ్యేంత వరకు నిలువు దోపిడే. అక్కడ ఏ పని జరగాలన్నా.. బ్రోకర్ ఉండాల్సిందే.

సగటు వాహనదారుడు అక్కడికి నేరుగా వెళ్లి పని చేయించుకున్న దాఖలాలు నల్లగొండ ఆర్టీఓ కార్యాలయం చరిత్రలో లేవని అంతా చెబుతుంటారు. కార్యాలయానికి వచ్చే ఎవ్వరైనా సరే.. బ్రోకర్ లేకుండా వెళితే.. ఫైల్ ముందుకు కదిలేది ఉండదు.. పని అయ్యేది ఉండదు. ఇక్కడ ప్రతి ఫైల్‌కూ ఓ రేటు ఫిక్స్. ఆర్టీఓ కార్యాలయాల్లో బ్రోకర్లకు బలి కాని వాహనదారుడంటూ ఉండరంటే అతిశయోక్తి కాదు.

బ్రోకర్లదే హవా..

నల్లగొండ కలెక్టరేట్‌కు అనుకుని ఉండే రవాణశాఖ కార్యాలయంలో నిత్యం అనధికారికంగా రూ.లక్షల్లో చేతులు మారుతుంటాయి. లైసెన్స్, రిజిస్ట్రేషన్, సీసీ ట్రాన్స్‌ఫర్, ఫిట్ నెస్, లైసెన్స్ రెన్యూవల్ తదితర పనులతో ప్రతిరోజూ రవాణశాఖ కార్యాలయం బిజీగా ఉంటుంది. అయితే ఈ బిజీ అంతా వాహనదారులతో అనుకుంటే పొరపాటే. ఇక్కడ ఏ పని జరగాలన్నా..

ఆర్టీఓ బ్రోకర్లదే హవా. నల్లగొండ ఆర్టీఓ కార్యాలయం పరిధిలో పదుల సంఖ్యలో బ్రోకర్లు ఉన్నారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదిలావుంటే.. ఏ వాహనదారుడైనా నేరుగా వెళ్లి ఆర్టీఓ కార్యాలయంలో పని చేయించుకోవాలంటే.. అది అయ్యే ప్రసక్తే లేదు. ఈ పేపర్లు లేవు.. ఆ పేపర్లు లేవు.. సంతకాలు మ్యా కాలేదంటూ సవాలక్ష కొర్రీలు పెడుతుంటారు. దీంతో వాహనదారులు చేసేదేం లేక బ్రోకర్లను ఆశ్రయిస్తుంటారు.

లైసెన్స్‌కు రూ.3200.. సీసీ ట్రాన్స్‌ఫర్‌కు రూ.2200..

నల్లగొండ ఆర్టీఓ కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, సీసీ ట్రాన్స్‌ఫర్ తదితర పనుల కోసం వాహనదారుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ప్రతి పనిలో బ్రోకర్లు.. ఆర్టీఓ కార్యాలయంలోని సిబ్బందికి ముట్టజెప్పాల్సిందే. అందులో ఏ ఫైల్‌కు ఎంత అనేది ముందుగానే ఫిక్సయ్యి ఉంటుంది. ఆ ధర ఎంతనేది.. బ్రోకర్లు, ఆర్టీఓ సిబ్బందికి ముందస్తుగానే ఒక ఒప్పందం ఉంటుంది.

దాని ప్రకారమే.. అక్కడ బ్రోకర్లకు క్షణాల్లో పనులు జరిగిపోతుంటాయి. ఇదిలావుంటే.. నల్లగొండ ఆర్టీఓ కార్యాలయంలో లైసెన్స్ తీసుకోవాలంటే.. బ్రోకర్లుకు రూ.3200 ముట్టజెప్పాల్సిందే. నిజానికి వాహనదారుడు నేరుగా వెళ్లి పని చేయించుకుంటే.. రూ.2వేలకు మించి అవ్వదు.

కానీ ఇక్కడ రూ.3200 తప్పక చెల్లిస్తేనే.. లైసెన్స్ వస్తుంది. ఇకపోతే సీసీ ట్రాన్స్‌ఫర్ కావాలంటే.. రూ.వెయ్యికి మించి కాదు. కానీ నల్లగొండ ఆర్టీఓ కార్యాలయంలో మాత్రం అక్షరాల రూ.2200 ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలా చెప్పుకుంటే పోతే ఒకటీ రెండూ కాదు.. కార్యాలయం నిండా ఇదే తరహాలు పనులు వెలుగులోకి వస్తుంటాయి.

కలెక్షన్ ఏజెంట్లుగా బ్రోకర్లు..

నల్లగొండ ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ ఏజెంట్లదే రాజ్యం. కార్యాలయంలోని సిబ్బంది, అధికారులకు బ్రోకర్లు కలెక్షన్ ఏజెంట్లుగా మారారనే చెప్పాలి. సీసీ ట్రాన్స్‌ఫర్‌కు రూ.300, లైసెన్స్‌కు రూ.500 ఇలా ప్రతి పనికీ బ్రోకర్లు అధికారులకు ముట్టజెప్పుతుండడంతో నిత్యం గుట్టుచప్పుడు కాకుండా రూ.లక్షల్లో అవినీతి జరుగుతోంది. ఇదంతా బహిరంగ రహస్యమే అయినా..

ఏ ఒక్క ఆర్టీఓ సిబ్బంది, అధికారిపై చర్యలు తీసుకుంది లేదు. ఓవైపు బ్రోకర్లు.. మరోవైపు ఆర్టీఓ సిబ్బంది, అధికారుల నడుమ వాహనదారులు బలైపోతున్నారనే చెప్పాలి. ఇప్పటికైనా రవాణశాఖ ఉన్నతాధికారులు స్పందించి.. నల్లగొండ ఆర్టీఓ కార్యాలయంలోని అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తారా..? లేదా..? అన్నది వేచిచూడాల్సిందే.