18-08-2025 01:37:42 AM
ఎమ్మెల్యే హరీష్ బాబు
కాగజ్‌నగర్, ఆగస్టు 17 (విజయక్రాంతి): పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కాగజ్‌నగర్ డివిజన్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక తన నివాసంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలంతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు.
ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటిస్తూ జారీ చేసిన జీవో నెం.49 ని పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటం విరమించేది లేదఅన్నారు. నియోజకవర్గంలోని దిందా పోడు రైతులతో పాటు వివిధ మండలాలలోని పోడు రైతులకు సంఘీభావంగా ఫారెస్ట్ డివిజన్ కార్యాలయాన్ని వేలాది మం ది పోడు రైతులు, ఫారెస్ట్ అధికారుల బాధితుల ఆధ్వర్యంలో ముట్టడిస్తామని తెలి పారు.
ఫారెస్ట్ అధికారుల అత్యుత్సాహం వలన సమస్య జటిలమైందే తప్పించి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరిద్దాం అనే ఆలోచనే ఫారెస్ట్ అధికారులకు లేకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ నాయకు లు, ఎమ్మెల్సీ దండే విఠల్ ఫారెస్ట్ అధికార్లకు వత్తాసు పలుకుతూ బీసీలకు పోడు భూములపై హక్కు లేదనడం అన్యాయం అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోలెం వెంకటేష్, జిల్లా కార్యదర్శి రాజేందర్ గౌడ్, మండల అధ్యక్షులు కుంచాల విజయ్, మాజీ కౌన్సిలర్ ఈర్ల విశ్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.