calender_icon.png 18 August, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి

18-08-2025 01:29:26 AM

  1. లేదంటే మేమే ఆన్ చేస్తాం
  2. ప్రాజెక్టు కూలిందన్న అబద్ధాన్ని నిజం చేయడానికే మోటార్లను ఆన్ చేస్తలేరు
  3. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు నష్టం
  4. మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, ఆగస్టు 17 (విజయక్రాంతి): వరద నీటిని సక్రమంగా వినియోగించకుండా, రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి, రాజకీయాల కోసం నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. ఆదివారం సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యంతో రైతులకు తీవ్రమైన నష్టం కలిగిస్తుందని విరుచుకుపడ్డారు.

శ్రీపాద ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీళ్లు వస్తున్నా ప్రభుత్వం మోటార్లను ఆన్ చేయడం లేదన్నారు. ఎల్లంపల్లిలో 7 మోటార్లు నడిపితే రోజుకు 2 టీఎంసీల నీళ్లు మిడ్ మానేరుకు వస్తాయని చెప్పారు. కానీ కేవలం 3 మోటార్లు మాత్రమే నడుపుతున్నారని చెప్పారు. వరద నీటిని సముద్రంపాలు చేస్తూ ప్రభుత్వం రైతాంగాన్ని దెబ్బతీస్తోందని, ఇది నేరపూరిత నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులు ప్రభుత్వ బురద రాజకీయాలకు బలవుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడానికే మోటార్లను ఆన్ చేయడం లేదని ఆరోపించారు. మోటార్లను ఆన్ చేయకుంటే వేలాదిమంది రైతులతో కలిసి మోటార్లను ఆన్ చేస్తామని హెచ్చరించారు. మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ పాడుచేయాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఒక మోటారు నడవాలంటే ఒక జిల్లా వాడేంత కరెంటు పడుతుందని వివరించారు.

బీహెచ్‌ఎల్ కూడా ఈ విధానం తప్పు అని హెచ్చరించిందని గుర్తు చేశారు. అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయని, వీటిని నింపితే యాసంగిలో లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని పేర్కొన్నారు. ‘బీఆర్‌ఎస్ పార్టీ రైతుల కోసం ఎప్పుడూ పోరాడుతుందని, వరద నీటిని సముద్రం పాలు చేసి, రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టిన ప్రభుత్వంపై రైతుల పక్షాన పోరాటానికి బీఆర్‌ఎస్ సిద్ధమవుతుందని వెల్లడించారు.