18-08-2025 12:14:15 AM
నంగునూరు, ఆగస్టు 17 : సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే. హైమావతి ఆదివారం నంగునూరు,కోహెడ, చిన్నకోడూరు మండలలో లోలెవల్ బ్రిడ్జిలు,కాజ్వేలను పరిశీలించారు. వర్షాల కారణంగా నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున, ప్రజల భద్రత కోసం అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.ఆర్ అండ్ బి డి.ఇ. వెంకటేష్ తో కలిసి కలెక్టర్ నంగునూరు మండలంలోని అక్కినేపల్లి వద్ద మోయతుమ్మెద వాగుపై గల లో లెవెల్ బ్రిడ్జిని, బద్దిపడగ వద్ద ఉన్న ఊర చెరువు మత్తడి కింద రోడ్డును పరిశీలించారు.
అనంతరం కోహెడ మండలంలోని గుండారెడ్డిపల్లి వద్ద నక్కవాగు, తంగళ్ళపల్లి వద్ద పిల్లివాగులను, అలాగే చిన్నకోడూరు మండలం సికింద్లాపూర్, ఇబ్రహీంనగర్ వద్ద గల వాగుల పైనున్న కాజ్వేలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అవసరమైనప్పుడు ఆయా కాజ్వేలు, బ్రిడ్జిలపై రాకపోకలను నిలిపివేసి, ప్రజలను అప్రమత్తం చేయాలని ఆర్ అండ్ బి డి.ఇ. వెంకటేష్ కు ఆమె స్పష్టం చేశారు. వర్షాల కారణంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులకు సూచించారు.