calender_icon.png 9 January, 2026 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్‌లైన్ పెట్టుబడుల స్కాం ముఠా గుట్టురట్టు

07-01-2026 12:00:00 AM

  1. రూ.200 కోట్లు కొల్లగొట్టిన సైబర్ క్రైం ముఠా
  2. కేసును ఛేదించిన ముంబై పోలీసులు
  3. అదుపులోకి ఏడుగురు నిందితులు

ముంబై, జనవరి ౬: ఆన్‌లైన్ పెట్టుబడుల పేరిట ప్రజల బ్యాంక్ ఖాతాలను కొల్లగొట్టి సొమ్ముచేసుకుంటున్న సైబర్ ముఠాను మంగళవారం ముంబై పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యులంతా ఉన్నత విద్యావంతులు కావడం గమనార్హం. వీరు షేర్ మార్కెట్, గోల్ ట్రేడింగ్, ఫారెక్స్ ట్రేడింగ్ వంటి విభాగాల్లో భారీ లాభాలు వస్తాయంటూ నకిలీ వెబ్‌సైట్స్ సృష్టించారు. అమాయక ప్రజలను ఆకర్షించేందుకు ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రమోట్ చేశారు.

కోట్ల రూపాయలు తమ బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. మ్యాట్రిమోనియల్, డేటింగ్ సైట్లలో నకిలీ ప్రొఫైళ్లు సృష్టించారు. పెళ్లి సంబంధాలు, డేటింగ్ పేరిట పలువురిని పరిచయం చేసుకుని వారిని డిజిటల్ అరెస్ట్ చేసి డబ్బు గుంజారు. తమ కార్యకలాపాలను ఒకే చోట సాగించకుండా తరచూ ప్రదేశాలు మారుస్తూ పోలీసుల కళ్లు గప్పారు. ఈ కేసును సవాల్ తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

తాజాగా ముంబైలోని మీరా రోడ్ హైవేలోని ఒక హోటల్‌పై దాడులు నిర్వహించారు. ఏడుగురు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై 11 రాష్ట్రాల్లో 51 కేసులు నమోదయ్యాయని, వీరు సుమారు రూ.200 కోట్ల వరకు కొల్లగొట్టారని ప్రాథమిక అంచనాకు వచ్చారు.