07-01-2026 12:00:00 AM
ముంబై, జనవరి ౬: తనకు ఆరుగురు పిల్లలు ఉన్నారని.. మీరెందుకు ఎనిమిది మందిని కనడం లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. దేశ జనాభా సమతుల్యత దెబ్బతినకుండా ఉండేందుకు ప్రతి హిందువూ కనీసం నలుగురు పిల్లల చొప్పున కనాలని ఇటీవల బీజేపీ నాయకురాలు నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్రలోని అకోలాలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నవనీత్ కౌర్ పేరు ఎత్తకుండానే చురకలటించారు.
కొందరు వ్యక్తులు నలుగురు పిల్లలను కనాలని చెబుతున్నారని, నలుగురు మాత్రమే ఎందుకు.. ఎనిమిది మందిని కనాలని ఎద్దేవా చేశారు. గతంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఎక్కువ మంది పిల్లలను కనాలని అన్నారని గుర్తు చేశారు. వారంతా కావాలంటే 20 మంది చొప్పున కంటే బాగుంటుందన్నారు.