07-01-2026 12:00:00 AM
ఢాకా, జనవరి ౬: బంగ్లాదేశ్ హిందూ మైనారిటీలపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థి నేత హాదీ మరణం తర్వాత ఈ దాడులు మరింత పెరిగాయి. దండుగులు తాజాగా మరో హిందువును పొట్టనపెట్టుకున్నారు. గడిచిన ౧౮ రోజుల్లోనే అలా దుండగులు ఆరుగురు హిందువులను హతమార్చారు. తాజా హత్య రాత్రి నర్సింగిడి జిల్లాలో చోటుచేసుకున్నది. చార్సిందూర్‌కు ఎందిన మణిచక్రవర్తి (40) స్థానికంగా కిరాణా దుకాణం నడుపుతున్నాడు.
సోమవారం రాత్రి దుకాణంలో మణిచక్రవర్తి ఉండగా, గుర్తుతెలియని దుండగులు అక్కడికి వచ్చి దాడి చేసి పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.
హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఇటీవల మణిచక్రవర్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతోనే దుండగులు హతమార్చి ఉంటారని స్థానికులు చెప్తున్నారు. మూడువారాల్లో ఇప్పటివరకు దీపూ చంద్రదాస్, అమృత్ సామ్రాట్ మండల్, బజేంద్ర బిశ్వాస్, ఖోకన్ చంద్రదాస్, రాణాప్రతాప్ అనే హిందువులు దుండగుల చేతుల్లో హతమవగా, తాజాగా మణిచక్రవర్తి హత్యకు గురయ్యాడు.