27-01-2026 01:09:03 AM
చౌటుప్పల్ వద్ద ఘటన
సూర్యాపేట, జనవరి 26 (విజయక్రాంతి) / చౌటుప్పల్ : గుండెపోటుతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి చెందిన ఘటన సోమవారం చౌటుప్పల్ వద్ద జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ప్రకారం ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు హైద రాబాద్ నగరంలోని మియాపూర్ నుంచి విజయవాడకు బయలుదేరింది.బస్సు చౌటుప్పల్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ నాగరాజు (39)కు ఛాతిలో నొప్పి వచ్చింది.
దీంతో వెంటనే బస్సును పక్కన ఆపాడు. అనంతరం సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. అయితే అక్కడ డాక్టర్లు లేకపోవడంతో వెంటనే ఆటో డ్రైవర్ ఆయన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు.అప్పటికే డ్రైవర్ నాగరాజు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు. కాగా ఆ సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. తన ఛాతిలో నొప్పి వస్తున్నా.. భయపడకుండా ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా నాగరాజు బస్సును పక్కన ఆపాడు. ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు ఉండి ఉంటే ఆయన బతికే అవకాశం ఉండేదని ప్రయాణికులు పేర్కొన్నారు.
కలవర పెడుతున్న ఘటనలు
ఇటీవల ఆర్టీసీ డ్రైవర్లకు గుండెపోటు ఘటనలు కలవర పెడుతున్నాయి. నెలకు పదుల సంఖ్యలో డ్రైవర్లు రిటైర్మెంట్ అవుతుండగా కొత్తవారిని రిక్రూట్ చేసుకోకపోవడంతో ఉన్నవారితోనే బస్సులు నడపాల్సి వస్తుంది.వాస్తవికంగా డ్రైవర్లు 8 గంటలు మాత్రమే డ్యూటీ చేయాల్సి ఉండగా ప్రస్తుతం డ్రైవర్ల కొరతతో డబుల్ డ్యూటీలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో రోజుకు 12 నుంచి 14 గంటల వరకు పని చేయాల్సి వస్తుంది. పని ఒత్తిడి, దూర ప్రాంతాలకు బస్సులను నడపాల్సి రావడం వంటి కారణాలతో డ్రైవర్లు అనారోగ్యం బారిన పడుతు న్నారు.
చాలా మంది వెన్ను నొప్పి సమస్యతో బాధ పడుతున్నారు. ఇటీవల గుండెపోట్లు సైతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత ఆరు నెలల సమయంలోనే రాష్ట్రంలో ఐదుగురు డ్రైవర్లు మృతి చెందగా, మరి కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురైన సందర్భాలు ఉన్నాయి. కావున ఆర్టీసీ యాజమాన్యాలు స్పందించి డ్రైవర్ల ఆరోగ్యంపై తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. డిపోల వారిగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లకు తగిన విశ్రాంతి ఇవ్వాలని సూచిస్తున్నారు.