16-11-2025 07:34:45 PM
బోడుప్పల్లో 352వ వారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు జ్ఞానమాల
ప్రజాకవి అందెశ్రీ కి అంబేద్కర్ సంఘం సభ్యుల శ్రద్ధాంజలి
మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 352వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా కవి, వాగ్గేయకారుడు అందెశ్రీ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ జిల్లా బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ పాల్గొని అందెశ్రీ రచనలను, ఆయన చేసిన సేవలను, తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాటల ప్రాముఖ్యతను స్మరించుకున్నారు.
అనంతరం నత్తి మైసయ్య మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో తెలంగాణ పాటలకు, ఆటలకు ప్రత్యేక స్థానం ఉందని, అందెశ్రీ పాట తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందని, అతి సాధారణ స్థాయి నుండి ప్రజా కవి అందెశ్రీ మహోన్నత స్థానాన్ని సంపాదించుకున్నారని, తెలంగాణ చరిత్ర ఉన్నంతవరకు అందెశ్రీ పాట నిలుస్తుందని నత్తి మైసయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో రాపోలు శ్రీరాములు, గరుగుల యాకయ్య, చిల్ల అంజయ్య మైసగళ్ళ జానీ కుమార్, వై శ్రీనివాస్, జడ శ్రీనివాస్, యేసు రాజు తదితరులు పాల్గొన్నారు.