06-12-2025 12:00:00 AM
మానకొండూరు, డిసెంబర్ 5 (విజయ క్రాంతి):ఆటపాటలతో కూడిన అంగన్వాడీ విద్య పిల్లల భవిష్యత్తుకు ఎంతగానో ఉపకరిస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య బోధించడంతో పాటు పిల్లల ఆరోగ్యం, పోషణపై అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారిస్తారని, అందువల్ల అంగన్వాడిలో పిల్లలను చేర్పించాలని కోరారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అల్గునూరు లోని కాకతీయ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన శుక్రవారం సభకు కలెక్టర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటపాటలతో కూడిన అంగన్వాడీ విద్య పిల్లల భవిష్యత్తుకు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. అంగన్వాడీల్లో పిల్లల బరువులు, ఎత్తు కొలుస్తూ వారు పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా చూస్తారని చెప్పారు. పోషకాహారంతో పాటు ఆలనా, పాలన చూసే అంగన్వాడి కేంద్రాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ దవాఖానాలు, ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయని, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఈ కేంద్రాల నుంచి ఉచితంగా మందులు స్వీకరించాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు 4 ఏ. ఎన్. సి పరీక్షలు చేయించుకోవాలని, ఎంతో ఖరీదైన టీఫా వంటి స్కానింగ్ సౌకర్యం కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు, ప్రసవాలు చేయించుకోవడం ద్వారా డబ్బు ఆదాతో పాటు ఆరోగ్యం బాగుంటుందని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, మెప్మా పీడీ స్వరూపారాణి, సిడిపిఓ శ్రీలత, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, చైల్ లైన్ కోఆర్డినేటర్ సంపత్, డిహెచ్‌ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ శ్రీలత, సఖి కేంద్రం అడ్మిన్ లక్ష్మి, మెప్మా డీఎంసీ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.