26 March, 2026 | 1:35 AM

అన్నదాత ఆగమాగం

26-03-2026 12:00 AM
  1. అకాల వర్షంతో.. తీరని భారీ నష్టం..
  2. లబోదిబోమంటున్న రైతన్నలు..
  3. చేతికొచ్చే పంట నేల రాలడంతో రైతన్న కన్నీరు మున్నీరు
  4. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్నల డిమాండ్...
  5. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో వడగళ్ల వాన..

బాన్సువాడ, మార్చి 25 (విజయ క్రాంతి): అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం  చేశాయి. కురిసిన వడగండ్ల వానాలతో ఆరుగాలం పండించుకున్న పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రకృతి వైపరీత్యాలతో ప్రతిసారి రైతుల ఆగమాగం రైతులు అవుతున్నారు. అర్షకుల కష్టాన్ని వారణుడు కబళించుకు బోతున్నాడు. ఈసారి అదే జరిగింది. మంగళవారం అర్ధరాత్రి కురిసిన వరదల వానలతో ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో పంటలపై తీవ్ర ప్రభావం చూపింది.

గత వానాకాలం సీజన్లో పంటలు చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలు కురవడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పూర్తిగా దిగుబడుల తగ్గిపోయి, అన్నదాత అప్పుల పాలయ్యారు. యాసంగి సీజన్ పై గంపెడు ఆశలు పెట్టుకుని అన్నదాత అప్పో,సోప్పో తెచ్చి పంటలు సాగు చేస్తుంటే, మరో పక్షం రోజుల్లో చేతికి వచ్చే వరి, మొక్కజొన్న, జొన్న, కూరగాయలు, పత్తి, కురుస్తున్న వడగళ్ల వాన తీవ్రంగా దెబ్బతిస్తున్నాయి. గత రెండు రోజుల నుండి కురిసిన అకాల భారీ వర్షాల వల్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ముఖ్యంగా వరి పంటపై వడగళ్ల వాన తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కొన్నచోట్ల పొట్ట విప్పుకొని పాలు తాగుతుండగా, మరి కొన్నిచోట్ల కంకి గట్టిపడుతున్న సమయంలో ఈ వడగళ్ల వాన తో తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కళ్ళ ముందే మరో పక్షం రోజుల్లో చేతికి వచ్చే ఈ వరి పంటలు అకాల వర్షాలు అన్నదాతలను ఆగం పట్టిస్తున్నాయి.

గత రెండు మూడు రోజుల కిందట రాత్రి కురిసిన వడగళ్ల వానకు బీర్కూర్, పోతంగల్, కోటగిరి, వర్ని, బాన్సువాడ ,బోధన్, ఎల్లారెడ్డి, గాంధారి, పిట్లం, జుక్కల్, నిజాంసాగర్, బిచ్కుంద, ఎడపల్లి, సాలూర, నందిపేట్, నవీపేట్, మండలాల్లో వరి పంటలకు తీవ్రంగా దెబ్బతీశాయి. మరో వారం రోజుల పాటు ఈ అకాల వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించడం పట్ల అన్నదాత మరింత కృంగిపోతున్నారు. నోటికి వచ్చిన పంట అకాల వర్షాలు వల్ల దెబ్బ తినడంతో అన్నదాత కోలుకోలేని పరిస్థితి నెలకొంది.

పుచ్చ సాగుపై వైరస్ దాడి...రైతుకు రూ. 10 లక్షల నష్టం

ఇటు ప్రకృతి వైపరీత్యాలతో కురుస్తున్న వడగండ్ల వానలు... అటు వైరస్ దాడులతో భూతల్లిని నమ్ముకున్న రైతులు నష్టాలని చవిచూడాల్సి వస్తుంది. ఆసాముల వద్ద అప్పులు తెచ్చి అధిక దిగుబడులతో రాబడి సాధించవచ్చు అన్న ఆశ వారికి నిరాశని మిగులుస్తుంది. చేతికొచ్చిన పంటలు ఓవైపు చేజారిపోతుండగా, వైరస్ కీటకాలు మరోవైపు ఏపుగా పెరుగుతున్న పంటను కాటు వేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.

పంట సాగు చేసి పెట్టుబడులు పెట్టి, ఆరుగాలం  కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు తమకు దక్కది అన్న బాధతో అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కనీసం పంటల మార్పిడితో నైనా అధిక లాభాలు గడించవచ్చునని వారి ఆలోచన వైరస్ దాడితో తలకిందులు చేసింది. పంట మార్పిడితో  అధిక దిగుబడులు సాధించి లాభాలు  పొందవచ్చునని ఒకవైపు వ్యవసాయ శాఖ, మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులను పంటల మార్పిడి పై దృష్టి పెట్టడానికి అవగాహన కల్పించారు.

ప్రతి సంవత్సరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎక్కువగా వరి సాగు, తో పా టు సోయా, మొక్కజొన్న, జొన్న సాగు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఒకే పంటను సాగు చేయడం వల్ల దిగుబడులు తగ్గడంతో పాటు, భూమిలో కావలసిన పోషకాలు తగ్గిపోయి, చీడపురుగుల బారినపడి పంటలు దెబ్బతింటు న్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ పంటల మార్పిడి చేయాలని సూచించడంతో, కొంతమంది రైతులు ఇతర పంటలపై దృష్టి మళ్లించారు. దీంట్లో భాగంగా.

కామారెడ్డి జిల్లా, పిట్లం మండలం చిన్న కొడఫ్గల్ గ్రామానికి చెందిన రైతు సలీం, పిట్లం శివారులో 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పుచ్చకాయ సాగు చేశారు. సుమారు రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టిన ఈ పంట, చేతికి వచ్చే సమయంలో వైరస్ బారిన పడి రంగు మారి పాడైపోయింది. కళ్ళముందే పంట నాశనం కావడంతో రైతు తీవ్రంగా నష్టపోయి లబోదిబోమంటున్నారు. ఈ సంఘటన అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చింది. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.