21-09-2025 11:35:51 PM
కోదాడ నియోజకవర్గ అభివృద్ధికై అనేక అభివృద్ధి కార్యక్రమాలు
పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి..
భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి..
కోదాడ: కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి నిరుపేదకు ఉచితంగా విద్య వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. ఆదివారం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మాణం చేయబడుతున్న వంద పడకల ఆసుపత్రిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... పేదవాడికి పెద్ద జబ్బు చేస్తే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోలేక అనేకమంది తమ ప్రాణాలను కోల్పోతున్నారని, వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి లేకుండా ఉండేందుకు కోదాడలో కోట్ల రూపాయల నిధులతో 100 పడుకుల ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నామన్నారు. నిర్మాణం పూర్తి చేసుకుని కోదాడ ప్రజలకు ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే అనేకమంది పేదలకు వైద్యం పరంగా బాసటగా నిలుస్తుంది అన్నారు.
ఆస్పత్రి నిర్మాణ విషయంలో నాణ్యత ప్రమాణాలను పాటించకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యంతో పాటు విద్యకు కూడా అధిక ప్రాధాన్యత కలిగిస్తున్నామని, అందులో భాగంగానే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జవహర్ విద్యాలయం కోదాడలో నిర్మించుతున్నట్లుగా తెలిపారు. అంతేకాకుండా 250 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మించనునట్లు తెలిపారు.. అధికారులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని ఆయన సూచించారు. అనంతరం కోదాడ నియోజకవర్గంలోని మహిళా మణులకు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్య మహిళా సిబ్బందికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డిఓ సూర్యనారాయణ కోదాడ ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ దశరథ్, హుజూర్నగర్ ఆసుపత్రి సూపర్డెంట్ ప్రవీణ్, మున్సిపల్ కమిషనర్ రమాదేవి అరుణ్ కుమార్ఎమ్మార్వో మజీద్ అలీ తదితరులు అధికారులు నాయకులు పాల్గొన్నారు.