21-09-2025 11:41:15 PM
మణికొండ: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవనాడి అయిన బతుకమ్మ పండుగకు మణికొండలోని అలకాపూర్ టౌన్‌షిప్ ఘనంగా స్వాగతం పలికింది. అలకాపూర్ గణేశ మండలి, ఏటీఆర్‌డబ్ల్యూఏ సంయుక్త ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు స్థానిక ఎంజీ పార్కులో కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు, మహిళల కోలాటాలు, చిన్నారుల కేరింతలతో ఆ ప్రాంగణమంతా పూల వనాన్ని తలపించింది. తొమ్మిది రోజుల పండుగలో తొలి రోజైన ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన ఈ సంబురాల్లో మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
రంగురంగుల పట్టుచీరలలో మెరిసిపోతూ, బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లు చరుస్తూ, "ఒక్కొక్క పువ్వేసి చందమామ" అంటూ సాగిన వారి ఆటపాటలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ప్రకృతిని ఆరాధిస్తూ, ఆడపడుచుల ఆనందాన్ని చాటే ఈ వేడుక తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టింది.ఈ వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు ప్రకాశ్ గౌడ్, పురపాలక సంఘం మాజీ అధ్యక్షుడు కస్తూరి నరేందర్ పాలుపంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు సైతం ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ ఆడి తమ ఐక్యతను చాటారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సాంస్కృతిక వేడుకలో మమేకమై పండుగ శోభను ఇనుమడింపజేశారు. ఈ కార్యక్రమంతో అలకాపూర్ టౌన్‌షిప్‌లో బతుకమ్మ ఉత్సవాలకు అద్భుతమైన ఆరంభం లభించినట్లయింది.