07-01-2026 12:00:00 AM
న్యూఢిల్లీ, జనవరి 6: దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత పెరగడంతోపాటు వాయు కాలుష్యం కారణంగా ఏఐసీసీ అగ్ర నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ సోమవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది ఆమెను హుటాహుటిన సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు ఆమెకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి చలికితోడు వాయుకాలుష్య తీవ్రత పెరగడంతోనే ఆమె అస్వస్థత పాలయ్యారని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ ప్రకటించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని స్పష్టం చేశారు.